Telangana Talli | హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘ఉద్యమతల్లే ముద్దు… బలవంతంగా రుద్దేతల్లి వద్దే వద్దు’ అని ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ స్పష్టంచేశారు. తల్లి రూపు మార్పు తెలంగాణ సాంస్కృతిక విధ్వంసానికి తొలి ప్రమాద హెచ్చరిక వంటిదని అభిప్రాయపడ్డారు. ఉద్యమ ఉద్వేగాల్లోంచి పుట్టిన తల్లికి ఉత్తర్వులతో పనిలేదని, ఆ మాటకొస్తే భరతమాతకు ఏ ఉత్తర్వులు ఉన్నాయని ప్రశ్నించారు. తెలుగుజాతి పేరుతో ఆనాడు.. బహుజనతల్లి పేరుతో ఈనాడు జరిగేదంతా పచ్చి మోసం అని చెప్పారు. ఏ బహుజనతల్లికి కిరీటాలు లేవో చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణతల్లి రూపు మార్పు వెనుక అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేసేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ఎత్తుగడగా అనుమానించాల్సిందేనని ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మీరన్నది నిజమే. ఆయా సందర్భాల్లో తల్లులకు రూపాలు ఇచ్చి కొలిచిన మాట వాస్తవమే. తుదిదశ తెలంగాణ ఉద్యమంలో రూపుదిద్దుకున్న తల్లి తెలంగాణ అంతటా పరివ్యాప్తమైంది. ఇవ్వాళ తెలంగాణతల్లి విగ్రహం లేని ఊరు దాదాపుగా లేదంటే అతిశయోక్తి కాదు. 2006 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయిన రూపం అన్నది నిర్వివాదాంశం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విగ్రహాలను ప్రజలు జేఏసీలుగా ఏర్పడి స్వచ్ఛందంగా ప్రతిష్ఠించుకున్నారు. ఆ విగ్రహాలను ఒక పార్టీకి ఆపాదిస్తరా?
తెలంగాణతల్లి ఎట్లా ఉండాలి? అన్న చర్చ మలిదశ ఉద్యమకాలంలో తెరమీదికి వచ్చినప్పుడు.. తెలంగాణ అస్తిత్వం తనను తాను ఆవిష్కరించుకున్న రూపమే ప్రస్తుతం ఉన్న తెలంగాణతల్లి. బహుజనుల మీద తుపాకీ పెట్టి ప్రస్తుతం ఉన్న తల్లిని కాల్చేస్తామంటే ఏ బిడ్డ ఒప్పుకుంటడు? తల్లిభావన ఆరాధనీయమైనది. పూజనీయమైనది.
ఈ ప్రశ్న ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీకి వేయండి. వాళ్లూ బతుకమ్మ ఆడినట్టు ఫొటోలను ట్వీట్ చేసుకున్నారు. వాటిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. తెలంగాణ ఉద్యమం, సంస్కృతితో ఏమాత్రం మమేకం కానివాళ్లు, సంస్కృతితో సంబంధం లేనివాళ్లు పరాయి మూకల కిరాయిదారులు చెప్పే మాటలుగానే భావించాల్సి ఉంటుంది.
ఏ తల్లీ తన పిల్లల చేతులను తొక్కుకుంటూ నిలబడాలని కలలో కూడా కోరుకోదు. తన ప్రాణం పోయినా సరే తన పిల్లలు బాగుండాలని తల్లి పరితపిస్తది. జొన్నపంట తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు. మహారాష్ట్రలో నంబర్ వన్, తెలంగాణలో 8వ స్థానం. తెలంగాణ అంటే బతుకమ్మ కదా. తెలంగాణతల్లి నుంచి బతుకమ్మను ఎందుకు వేరు వేశారు? బతుకమ్మను వేరు చేయడం అంటే బతుకునే లేకుండా చేయడం. అస్తిత్వపు ఆనవాళ్లు లేకుండా చేయడం. నాడు ‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ లాంటి సినిమా పాటలతో తెలంగాణ అస్తిత్వం లేకుండా చేయాలని చూశారు. ఇవ్వాళ తెలంగాణ నుంచి బతుకమ్మను లేకుండా చేసి అసలు మనకు సంస్కృతే లేకుండా చేయాలని ఇంత మోసానికి ఒడిగట్టారు. బతుకమ్మను తీసేసి పార్టీ సింబల్ పెడ్త్తరా? ఎక్కడైనా ఇలా చేస్తరా? ఇంత దారుణమా?
బతుకమ్మకు వందల ఏండ్ల చరిత్ర ఉన్నదని ఆచార్య బిరుదురాజు రామారాజు చారిత్రక, జానపద ఆధారాలను ఏనాడో చెప్పారు. తెలంగాణకు తలమానికమైన పండుగ. శ్రామిక మహిళల సాహిత్యంతో కలగలసిన పండుగ. బతుకమ్మను అవమానించడం అంటే తెలంగాణ మూలాలను అవమానించడమే. అందుకు కాంగ్రెస్ నాయకులు తెగబడుతున్నరు.
అవును. ‘మనవేలుతో మన కన్నునే పొడవాలి’ అనే కుతంత్రం అప్పుడూ ఉన్నది. ఇప్పుడూ కొనసాగుతున్నది. రాజకీయ మూలాల నేపథ్యాలను పరిశీలిస్తే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని శక్తుల కుట్రలు ఇందులో దాగున్నాయేమోననే అనుమానం కలుగుతున్నది. ‘తల్లా పెళ్ల్లామా?’ సినిమాలో సినారె చేత ఆ పాట రాయించిన తరువాత తెలంగాణ సమాజం సినారె అంతటివారినే ఏ విధంగా చూసిందో అప్పటివాళ్లకు తెలుసు. ఇప్పటికీ ఉన్న తల్లిరూపాన్నే మార్చడం అంటే తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి జారీ చేసిన తొలి ప్రమాద హెచ్చరిక అనే ఆందోళన కలుగుతున్నది.
‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావం డి’ అన్నట్టే ఉన్నది ఈ వాదన. ఎక్కడైనా ఉద్యమానికి భావోద్వేగం ఉంటుంది కానీ, ప్రభుత్వానికి ఉండదు. మలిదశ తెలంగాణ ఉద్యమ భావోద్వేగంలోంచి పుట్టిన తల్లిని కాదని, జీవోలు ఇచ్చిన తల్లిని మాత్రమే కొలవాలి అంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర అవతరణ అనంతర కాలంలో తెలంగాణతల్లిని కొలవడంలో ఎక్కడ తక్కువ జరిగింది?
నిజమే. రాజకీయాలు, రాజకీయ పార్టీలతో ప్రజలకు సంబంధం ఉండాల్సిన పనిలేదు. కానీ, నిన్న ఒక ప్రభుత్వం ఉన్నది. ఇవ్వాళ ఈ ప్రభుత్వం ఉన్నది. రేపు మరో ప్రభుత్వం వస్తుంది. అదేదో నాటకంలో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అన్నట్టు ఒకటోతల్లి, రెండో తల్లి, మూడో తల్లి ఉండదు. తెలంగాణతల్లి ఒక్కరే. అది ఉద్యమంలోంచి ఉద్భవించిన తల్లి. రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని మార్చినప్పుడల్లా తల్లి మారుతుందా? ఇదేం ఖర్మ మనకు.
ఎందుకు ఉండకూడదు. ఏ బహుజనతల్లికి, దేవతకు కిరీటం లేదో చెప్పండి. ఈ లెక్కన నల్లపోచమ్మ, కొండపోచమ్మ, కట్టమైసమ్మ, రేణుకాఎల్లమ్మ, గొల్లకేతమ్మ.. ఇలా బహుజన దేవతలకు ఉన్న కిరీటాలను తొలగిస్తారా? ఆ పనికి ప్రభుత్వమే పూనుకుంటుందా? బహుజన దేవుళ్లకు కిరీటాలు, నగలు ఉండకూడదా? కాసేపు ప్రభుత్వం ప్రతిష్ఠించిన తెలంగాణతల్లి విగ్రహాన్నే బహుజనులకు ప్రతీక అని అనుకుంటే.. ఏ గ్రామీణతల్లి, చెల్లి, అక్క, అవ్వ చేతిలో ఏ పనిముట్టులేకుండా ఉంటుందా? పని సంస్కృతిని, జీవకారుణ్యానికి ప్రతీకగా ఉండకూడదా? చిట్యాల ఐలమ్మ చేతిలో కర్రనెందుకు పెట్టుకున్నాం? కుమ్రంభీముడి చేతిలో తుపాకీ ఎందుకు పెట్టుకున్నాం? అంటే వారి పోరాట నేపథ్యాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వాలని పెట్టుకున్నాం. ప్రభుత్వం ప్రతిష్ఠించిన తెలంగాణ విగ్రహంలో ఏమీలేదు. బతుకమ్మను తీసేయడం ఆడబిడ్డలను, సంస్కృతిని అవమానించడమే.