హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు సీజన్ దగ్గర పడుతున్నా రాష్ట్ర అవసరాలకు కావాల్సిన పత్తి విత్తనాల్లో సగం కూడా అందుబాటులో లేకపోవడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి తుమ్మల మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం 40లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయని, 15 రోజుల్లో మరో రెండు కోట్ల ప్యాకెట్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తామని వ్యవసాయశాఖ అధికారులు మంత్రికి వివరించారు. అధికారుల వివరణపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఒకవైపు సీజన్ దగ్గరపడుతుంటే ఇంకా సగం విత్తనాలు కూడా అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలిసింది.
ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నాబర్డ్, ఆర్ఐడీఎఫ్ నిధులను ఉపయోగించి మారెటింగ్శాఖ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మారెట్ యార్డుల పునర్విభజనకు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని మారెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సరిపడ పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, వాటి రిపోర్టులను రెండు నెలల్లోపు రైతులకు అందజేయాలని ఆదేశించారు. మార్ఫెడ్ ఆధ్వర్యంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పటికే లక్ష టన్నుల జొన్నలను సేకరించామని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా సరే రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని 311 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్)ను రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీవో)గా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. కొత్త ప్యాక్స్ ఏర్పాటుపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్యాక్స్ సీవోల బదిలీలపై వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. పదేండ్లుగా అపెక్స్ సహకార సంఘాల ఆడిట్ ఎందుకు జరగలేదని ఆడిట్ అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. సంబంధిత ఆడిట్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్సీఎస్ కమిషనర్‌ను ఆదేశించారు. 2021లో ఆయిల్ పాం ప్లాంటేషన్ చేసిన 2,800 మంది రైతుల నుంచి పంట వస్తున్నదా? లేదా? అని మంత్రి ఆరా తీశారు.
ఏప్రిల్, మే నెలల కేటాయింపుల ప్రకారం యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఉద్యానశాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేయాలని ఉద్యానశాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుడిమళ్ల సందీప్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఉద్యానశాఖ అధికారుల సంఘం కార్యదర్శి రావుల విద్యాసాగర్, సభ్యులు అనిల్‌కుమార్, కీర్తికృష్ణతో కూడిన బృందం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.