హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండగ సందర్భంగా తమ సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు నగరానికి తిరుగు ప్రయాణాలను మొదలు పెట్టారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సరిపడా రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ నేపథ్యంలో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఒకటి, రెండు ప్రత్యేక రైళ్లు కొద్దిపాటి ప్రయాణికులతోనే కిటకిటలాడిపోతున్నాయి.
దీంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, గర్భిణులు నానా అగచాట్లు పడుతున్నారు. అలాగే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనంగా జనరల్ బోగీలు ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు.. కేవలం ఒకటి రెండు జనరల్ బోగీలే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ముఖ్య పండుగలకు కూడా సరిపడా రైళ్లను ఏర్పాటు చేయడంలో రైల్వే అధికారులు విఫలం చెందారని ప్రయాణికులు మండిపడుతున్నారు.