Crop Insurance | హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ‘ఈ వానకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతున్నాం’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ మంత్రి మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సీజన్లు పూర్తవుతున్నా బీమా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫసల్ పంటల బీమా అమలుపై ప్రభుత్వం నాలుగు నెలల నుంచి చర్చిస్తూనే ఉన్నది. అధికారులు విధి విధానాలు సిద్ధం చేసి సీఎం రేవంత్‌రెడ్డికి ఫైలు పంపించినట్టుగా తెలిసింది.
నెల రోజులుగా ఆ ఫైలు సీఎం వద్దే పెండింగ్‌లో ఉందని తెలిసింది. వారం క్రితం సీఎం ఫైలుపై సంతకం చేయగా వ్యవసాయ అధికారులు, మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. ఇప్పుడేమో సీజన్ ముగింది కాబట్టి వచ్చే సీజన్ నుంచి అమలుకు ప్రయత్నిస్తామని ఓ వ్యవసాయ అధికారి తెలిపారు.
భారీ వర్షాలతో సుమారు 10-15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఫసల్ బీమా ఉంటే రైతులకు ఆర్థిక భరోసా దక్కేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులే నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మార్చిలో కురిసిన వర్షాలతో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించి ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం చెల్లించింది. ఏప్రిల్‌లోనూ సుమారు 3120 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రైతులకూ ఎకరాకు రూ. 10వేల పరిహారం ప్రకటించి ఇప్పటికీ చెల్లించలేదు. ఏప్రిల్ పరిహారం ఎగ్గొట్టి.. ప్రస్తుత పంటనష్టానికి పరిహారం చెల్లిస్తుందా? లేదా? అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.