Kaloji Kalakshetram | వరంగల్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక వరంగల్ నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య, నాటక రంగాల కార్యక్రమాలకు కేంద్రంగా నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం పడావుగా ఉంటున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవంబర్ 19న ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. ఆ రోజు ప్రారంభోత్సవం కోసం తీసిన తలుపులను కార్యక్రమం ముగియగానే మూసివేశారు. రెండు నెలలవుతున్నా ఇప్పటికీ మళ్లీ తెరువలేదు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో కళాక్షేత్రం నిర్మాణం పూర్తయ్యింది. కుడా పరిధిలోనే ఈ కళాక్షేత్రం నిర్వహణ ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేసినప్పటి నుంచి ఈ కళాక్షేత్రంలో ఇప్పటివరకు ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు.
వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోని వారు ఇక్కడ సాహిత్య, సాంస్కృతిక, నాటక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతారు. కార్యక్రమాల కోసం దీన్ని కేటాయించాలని కుడా అధికారులను కోరుతున్నా, వారెవరూ పట్టించుకోవడంలేదు. ఇందులో ఏ కార్యక్రమాలను నిర్వహించాలనేది స్పష్టతలేదు. రోజువారీగా ఎంత మొత్తం చెల్లించాలనేది ఖరారు కాలేదు. కారణాలు ఏమైనా కళాక్షేత్రం నిర్మించిన స్ఫూర్తి నెరవేరకపోవడంపై వరంగల్‌లోని కవులు, కళాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ నగరానికి ఉన్న ప్రతిష్టను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కళాకేత్రాన్ని కనీసం వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాళోజీ శతజయంతి వేడుకల సందర్భంగా..
ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాలు 2014 సెప్టెంబర్ 9న మొదలయ్యాయి. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్ అదే రోజు కాళోజీ కళాక్షేత్రం భవన నిర్మాణం కోసం భూమి పూజచేశారు. కేసీఆర్ ప్రభుత్వం 4.25 ఎకరాల్లో విభిన్న శైలిలో భవనాన్ని నిర్మించింది. 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నాలుగు అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. 1,500 సీటింగ్ సామర్థ్యంతో ఆడిటోరియం, మరో మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్ అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించా రు. గ్రౌండ్ ఫ్లోర్లో రెండు మేకప్ గదులు, ఆర్ట్ గ్యాలరీ, దీన్ని కూర్చుని చూడటానికి వీలుగా ఫ్రీ ఫంక్షన్ లాబీని ఏర్పాటు చేశారు. నాలుగు హైకెపాసిటీ లిఫ్ట్‌లను బిగించారు. 85.10 కోట్లతో భవన నిర్మాణం పూర్తయ్యింది.