హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తూర్పు, ఈశాన్య దిశ నుంచి 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలోకి చలిగాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ గాలులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు పొగమంచు దట్టంగా కురుస్తున్నది. బుధవారం ఉదయం అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరిలో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో 5.8, బేలలో 5.9, అర్లి(టీ)లో 5.9, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్డీపీఎస్ వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత రికార్డయ్యింది.