హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ‘మాయ రోగం’తో పడకేసింది. టీవీవీపీ పరిధి దవాఖానల్లో పనిచేసే వైద్యులు, ఇతర సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందకపోవడం తీవ్ర సమస్యగా మారింది. వైద్య సిబ్బందికి హెల్త్‌కార్డులు ఇవ్వకపోవడం, పలు జిల్లా దవాఖానల్లో సేవల సమన్వయకర్తల (డీసీహెచ్ఎస్) పోస్టులు భర్తీ చేయకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. 81 టీవీవీపీ దవాఖానల్లో సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ఉద్యోగోన్నతులు కల్పించడంలో రెండేండ్లకుపైగా ఆలస్యమవడంతో ఉద్యోగులు ప్యానల్ ఇయర్స్ కోల్పోవడంతోపాటు ప్రజలకు అందాల్సిన వైద్యసేవల్లో జాప్యం జరుగుతున్నది. కార్పొరేషన్ నుంచి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్)గా మార్చాలని ఏఎస్సీఐ కమిటీ సిఫారసు చేసినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కొన్ని నెలల క్రితం ఈ కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో పాలనా వ్యవస్థ, దవాఖానల నిర్వహణ, వైద్య సిబ్బంది సంక్షేమం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైద్యులతోపాటు సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
వైద్యులకు పెండింగ్‌లో పెట్టిన జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. టీవీవీపీ కింద పనిచేస్తున్న ఉద్యోగులందరికీ న్యాయం జరగాలంటే వెంటనే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్‌హెచ్‌ఎస్)ను వెంటనే ఏర్పాటు చేయాలి.