Nomula Bhagath : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శలు గుప్పించారు. రైతులకు ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలో పార్టీ స్థానిక నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. పొంకనాల రేవంత్‌రెడ్డి యాప్ పేరుతో రైతులను అరిగోస పెడుతున్నడని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ యాప్ వాడటం తెల్వక రైతులు ఇబ్బందులు పడుతున్నరని చెప్పారు. యాప్‌లో ఎకరాకు మూడు బస్తాల యూరియాకు బదులు ఒక బస్తా మాత్రమే ఫీడ్ చేసుకునేలా సెట్ చేశారని ఆరోపించారు. పోనీ ఒక బస్తా అయినా తీసుకుందామని, యాప్‌లో ఫీడ్ చేయించుకుని ఎరువుల దుకాణానికి వెళ్తే.. అక్కడ స్టాక్ లేదని చెబుతున్నారని విమర్శించారు.
యాప్‌లో స్టాక్ చూపిస్తున్నదని, స్టోర్‌కు మాత్రం యూరియా రాలేదని ఎరువుల దుకాణదార్లు జవాబిస్తున్నారని భగత్ చెప్పారు. ఈ చేతగాని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంవల్లే రైతులకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు యాప్‌లను తీసేసి రైతులకు మునుపటిలాగే నేరుగా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.