హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): నగరంలో పెరిగిన జనాభా రద్దీ, కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటో రిక్షాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 263 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా కారణంగా ఆటో రిక్షా పర్మిట్లకు బాగా డిమాండ్ పెరిగింది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి, మెరుగైన ప్రజారవాణా కోసం ఎలక్ట్రిక్/ఎల్పీజీ/సీఎన్జీ ఆటో రిక్షాలను అనుమతించడం అవసరమని ప్రభుత్వం భావించింది. దీంతో ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, 10వేల కొత్త ఎల్పీజీ ఆటోలు, మరో 10వేల కొత్త సీఎన్జీ అటో రిక్షాలకు అనుమతి ఇచ్చింది.
వీటితో పాటు డీజిల్, పెట్రోల్ వాహనాలకు సంబంధించిన రేట్రోఫిట్టింగ్ చేసి, వాటి ఇంజన్ను ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీగా మార్చుకోవడానికి 25వేల వాహనాలకు అవకాశం కల్పించింది. అలాగే ఇప్పటివరకు ఉన్న డీజిల్, పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్స్ఫర్, డీజిల్, పెట్రోల్ కొత్త ఆటో రిక్షాలకు ఓఆర్ఆర్ పరిధిలో అనుమతించబవు. ప్రభుత్వ ఆదేశాల ద్వారా దాదాపు 65వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.