హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో ఇప్పుడు కొడంగల్-నారాయణపేట లిఫ్ట్‌కు సంబంధించి ఎన్వోసీపై రచ్చ నడుస్తున్నది. తనకు తెలియకుండానే తన శాఖలో జరిగిన ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్రుమీద ఉన్నట్టు జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యమంత్రికి సన్నిహితుడు, ఇరిగేషన్‌శాఖ సలహాదారుడు ఆదిత్యానాథ్ దాస్ ఎన్వోసీలో కీలకపాత్ర పోషించారని తెలుస్తున్నది. ఇప్పటికే సలహాదారుడి చర్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి, తాజాగా ఎన్వోసీ ఉదంతం వెలుగులోకి రావడంతో మరింత రగిలిపోతున్నారని తెలిసింది.
ఆర్డీఎస్ ఎగువన కురిడి లిఫ్ట్
తుంగభద్ర జలాలను చెరబట్టేందుకు కర్ణాటక సిద్ధమైంది. తుంగభద్రపై ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువన దాదాపు 100 మీటర్ల పరిధిలోనే కురిడి డ్రింకింగ్ లిప్టును దాదాపు రూ.85 కోట్లతో 2 టీఎంసీల జలాలను తరలించే లక్ష్యంతో చేపడుతున్నది. అందుకనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి పనులను పరుగులు పెట్టిస్తున్నది. ఆర్డీఎస్కు 15 కి.మీ ఎగువన చిక్కాలపర్వి వద్ద రూ.397.50 కోట్లతో 5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రోడ్డు కమ్ బరాజ్, ఆర్డీఎస్ దిగువన రాయచూరు జిల్లాలోని చికమంచాల సమీపంలో 2.5 టీఎంసీల సామర్థ్యంతో బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మించేందుకు సిద్ధమైంది. కర్ణాటక చేపట్టిన బరాజ్‌ల నిర్మాణానికి తెలంగాణలోని రేవంత్ సర్కార్ గుట్టుగా ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సాగునీటిని అందించేందుకే కొడంగల్- నారాయణపేట లిఫ్ట్ స్కీమ్‌కు కర్ణాటక సర్కార్ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉండగా, అందుకు ప్రతిఫలంగా కర్ణాటక ప్రాజెక్టులకు గుట్టుగా ఎన్వోసీ జారీ చేసింది. ఫలితంగా కర్ణాటక కొడంగల్ లిఫ్ట్‌కు ఎన్వోసీ జారీ చేసింది.
అందులోనూ తమ ప్రాజెక్టులపై కేంద్రం వద్ద ఎలాంటి ఫిర్యాదులు, వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని కర్ణాటక మరీ మరీ చెప్పింది. ఆ ఎన్వోసీ గుట్టును ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల బట్టబయలు చేసింది. ఆర్డీఎస్ను ప్రశ్నార్థకం చేసే కర్ణాటక ప్రాజెక్టులకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఎన్వోసీ ఇవ్వడంపై కథనాలు ప్రచురించింది. ప్రస్తుతం దీనిపై తీవ్ర చర్చ కొనసాగుతున్నది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నిలదీస్తున్నది. అయితే ఈ ఎన్వోసీ సంగతి ఇప్పటివరకు మంత్రి ఉత్తమ్ దృష్టిలోనే లేదని జలసౌధ వర్గాలు వివరిస్తున్నాయి. ముఖ్యమంత్రి సన్నిహితుడు, ఇరిగేషన్‌శాఖ సలహాదారుడు ఆదిత్యానాథ్ దాస్, సెక్రటేరియట్ స్థాయి అధికారి మాత్రమే కొడంగల్ లిఫ్ట్ అనుమతుల విషయమై కర్ణాటకతో చర్చలు కొనసాగించారని చెప్తున్నాయి. ఆయన చర్చల తర్వాతే కర్ణాటక ఎన్వోసీ జారీ చేసిందని తెలుస్తున్నది. ఈ అంశం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, ఆదిత్యానాథ్ దాస్‌కు తప్ప ఎవరికీ తెలియదు. తాజాగా ఎన్వోసీ వెలుగులోకి రావడంతో అవాక్కవడం అమాత్యుడి వంతైంది. కీలకమైన అంశం తన దృష్టికి రాకుండానే చర్చలు జరిపి, ఎన్వోసీ తీసుకురావడంపై సదరు మంత్రి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దాస్ తీరుపై నిప్పులు చెరుగుతున్నట్టు జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇప్పటికే తీవ్ర అసంతృప్తి
నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యానాథ్ దాస్ తీరు, వ్యవహారాలపై మంత్రి ఉత్తమ్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌శాఖలో ఆయన పెత్తనమే కొనసాగుతున్నదని జలసౌధ వర్గాలు చెప్తున్నాయి. ఇంజినీర్లకు పోస్టింగులు, ఎక్స్టెన్షన్లు, బిల్లుల చెల్లింపు వరకు ప్రతిదానిలో ఆదిత్యానాథ్ దాస్, సీఎంవో కోటరీనే కీలక పాత్ర పోషిస్తున్నదని ఇంజినీర్లు చెప్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పర్యటన ఖరారయ్యేవరకూ మంత్రికి తెలియదని సమాచారం. సలహాదారు, కొద్దిమంది అధికారులే ఆ పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారని, తుది నిమిషంలో విషయాన్ని ఉత్తమ్‌కు తెలిపినట్టు జలసౌధలో చర్చ కొనసాగింది. బనకచర్ల అంశంపై రాష్ట్రం నుంచి సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ మాత్రమే మంతనాలు కొనసాగిస్తున్నారు. సమావేశాలకు సంబంధించిన వివరాలను మంత్రికి సైతం పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదని ఇరిగేషన్ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ముఖ్యమంత్రికే నేరుగా రిపోర్ట్ చేయడం, ఆయన ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారమే దాస్ చర్చలు కొనసాగిస్తున్నారని సమాచారం. చర్చలకు వెళ్లిన సంగతి కూడా ఒక దశలో మంత్రి దృష్టికి వెళ్లలేదని ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వ్యవహారం, ఆదిత్యానాథ్ దాస్ తీరుతో మంత్రి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని జలసౌధలో చర్చ జరుగుతున్నది. వాస్తవంగా ఇరిగేషన్‌శాఖపై బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రెస్‌మీట్ పెట్టిన వెంటనే అదేస్థాయిలో మంత్రి రియాక్ట్ అవుతుంటారు. కానీ ప్రస్తుతం పాలమూరు అంశం, తాజాగా కర్ణాటక ఎన్వోసీ, కేంద్రమంత్రితో భేటీ సందర్భంగా జరిగిన ఒప్పందాల వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నా మంత్రి మాత్రం మౌనంగా ఉండిపోయారు. తనకేం సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి, సలహాదారేనని ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు.