హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ‘మా తండ్రి మరణిస్తే ఊరికెళ్లాము అధ్యక్షా. దహన సంస్కారాలయ్యాక స్నానం చేసే ఇంటికి పోవాలి. బోరు దగ్గరికెళ్లి స్నానం చేద్దామంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంట్ ఏపిచ్చుకొని బోరు ఆన్‌చేస్తే లో ఓల్టేజీతో అది నీళ్లు పోస్తలేదు అధ్యక్షా. చేసేదేమీ లేక నెత్తిమీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినం. తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యం కావడానికి కారణం ఉమ్మడి పాలకులేనని నాకు ఆనాడు అర్థమైంది అధ్యక్షా’.. ఈ మాటలన్నది మరెవరో కాదు.. రేవంత్‌రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీటి కష్టాలపై అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, విద్యుత్తుపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అప్పుడో నీతి.. ఇప్పుడో నీతి
కరెంట్ కోతలపై రేవంత్‌రెడ్డి ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌పై, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీడీపీని దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన త ర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలపై విరుచుకుపడ్డారు. కరెంట్ కష్టాలు, కోతలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అంటూ తూలనాడిని ఆయన, ఇప్పుడేమో కాంగ్రెస్‌కు అసలు కరెంట్ కోతలతో సంబంధమే లేదని చెప్తున్నారు. రైతులకు ఉచిత కరెంటిచ్చింది కాంగ్రెస్సేనని చెప్పుకొంటున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న పార్టీ తప్పులను కప్పిపుచ్చుతూ.. బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు.