హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెలక్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందన్న సూచనలతో మళ్లీ పెట్రో కొరత ఏర్పడింది. దీంతో సోమవారం ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా బంకుల్లో క్యూకట్టిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ‘ఎలాంటి ఆయిల్ కొరత లేదు.. నిల్వలు పుష్కలంగా ఉన్నాయి ప్రజలు ఆందోళన చెందొద్దు’ అని పౌరసరఫరాల శాఖాధికారులు ప్రకటిస్తున్నా, పెట్రో ల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనంతటికీ ఆయిల్ కంపెనీలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతే కారణమని వి శ్లేషకులు తేల్చి చెప్తున్నారు. దేశంలో మరికొన్ని రోజులకు సరిపడా నిల్వలున్నాయని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగ డం, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణం గా ధరలు పెంచకపోవడంతో నష్టాలను తప్పించుకొనేందుకు చమురు కంపెనీలు ఏకంగా సరఫరాను తగ్గిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమేపీ తీవ్రతరం అవుతుండటంతో చమురు ధరలు పెరుగుతున్నాయి.
పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు
నిత్యం హెచ్చుతగ్గులు కారణంగా ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకొనే పనిలో పడ్డా యి. ఇరాన్, రష్యా నుంచి మన దేశానికి చము రు దిగుమతి చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితు ల్లో ఇరాన్ నుంచి సరఫరా తగ్గడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడం వల్ల డాలర్ రూపంలో నగదు చెల్లించాల్సి వస్తున్నందున ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఎప్పు డు ధరలు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతా యో తెలియని పరిస్థితులు ఏర్పడుతుండటం తో నష్టనివారణకు పూనుకుంటున్నాయి. భవిష్యత్తులో మరీ ముఖ్యంగా ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశీయంగా పెట్రో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉండటం తో సరఫరాను పూర్తిగా తగ్గిస్తున్నాయి. దీంతో రోజుల తరబడిగా ట్యాంకర్లు డిపోల వద్ద వేచి ఉంటున్నాయి. రెండు మూడు రోజులకోసారి సరఫరా చేస్తుండటంతో బంకులకు సరిపడా చమురు అందడం లేదు. ఫలితంగా కొరత ఏ ర్పడి ఇబ్బందులు తలెత్తాయి.
గ్రేటర్లో మళ్లీ టెన్షన్
హైదరాబాద్ నగరంలో మళ్లీ ఇంధన కొర త వినియోగదారుల్లో టెన్షన్ పుట్టిస్తున్నది. అ న్ని బంక్‌లు సోమవారం నోస్టాక్ బోర్డులతో దర్శనమిచ్చాయి. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. తెరిచి ఉన్న బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గ్రేటర్ పరిధిలో 460కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా, 95స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్ర స్తుతం వీటిలో చాలా బంక్‌లకు నోస్టాక్ బోర్డులు వేలాడాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ తదితర ప్రాంతాల్లోని పలు బంక్‌లు మూసివేసి ఉన్నాయి. సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని బంక్‌ల వద్ద ఆటోలు, ఇతర వాహనాలు ఎల్పీజీ, సీఎన్జీ కోసం భారీగా క్యూకట్టాయి. కొందరు వాహనదారులు తమకు రోజుకు సరిపడా కన్నా ట్యాంక్‌ఫుల్ చేయించుకోవడమే లక్ష్యం గా పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితితో బంక్‌లు అత్యధిక రద్దీతో కనిపించాయి. ఇక ఆటో గ్యాస్ ధర సైతం రూ.30 నుంచి రూ.40కి పెంచారని ఆందోళన చెందుతున్నారు.
ముందస్తు చెల్లింపులున్నా అందని చమురు
ఆయిల్ కంపెనీలు క్రెడిట్ విధానాన్ని ఎత్తేయడంతో డీలర్లు నగదును ముందస్తుగానే చెల్లిస్తున్నారు. ఆయా కంపెనీల డిపో ల్లో ముందస్తుగా నగదు చెల్లించినా ఆయిల్ ను సకాలంలో సరఫరా చేయట్లేదని డీలర్లు వాపోతున్నారు. రెండు మూడు రోజులదాకా లోడ్ రాక కొరత ఏర్పడుతుందని చె ప్తున్నారు. గతం కంటే చాలా తక్కువగా కంపెనీలు సరఫరా చేస్తున్నాయని, రెండు మూడు లోడ్లు అడ్వాన్స్ ఉంటున్నాయని వాపోతున్నారు. అందుకే నోస్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుందంటున్నారు. ఈ విషయం తెలియక పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం కొరత లేదని చెప్తున్నారని, దీంతో వినియోగదారులు తామే కొరత సృష్టిస్తున్నట్టు భావిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు సరఫరాను తగ్గిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నారు. కేంద్రం పట్టించుకోకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిపోయినంత సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడమే లేదు. పైపెచ్చు చమురు నిల్వలు కావాల్సినంత ఉన్నాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు. కేంద్రం ఒత్తిడి తెచ్చి కంపెనీలు సరిపడా సరఫరా చేసేలా చూడాలని కోరుతున్నారు.