ఆదిలాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఈ నెల ఒకటిన ఆర్భాటంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఆదిలాబాద్ జిల్లాలో ఆరురోజులకే తుస్సుమంది. ప్రభుత్వం గోదాం నుంచి బియ్యం సరఫరా చేయకపోవడంతో రేషన్ దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో ప్రతి నెలా తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులకు 356 దుకాణాల ద్వారా 4,062.84 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం నిల్వలు చేరుకోకపోవడంతో రేషన్ డీలర్లు లబ్ధిదారులకు అందించడంలేదు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం తెచ్చుకుందామని ఆశగా దుకాణాలకు వెళ్లిన లబ్ధిదారులకు నిరాశ ఎదురవుతున్నది.
ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యానికి బదులు అధికారులు తమకు దొడ్డుబియ్యం పంపిణీ చేస్తున్నారంటూ రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలంటూ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.