హైదరాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గం సిరసపల్లిలో డంపింగ్ యార్డు ( Dumping Yard ) ను రద్దు చేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ( MLA Padi Kaushik Reddy ) హెచ్చరించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి కరీంనగర్ ,ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన చెత్తను తమ నియోజకవర్గంలో ఏర్పాటుకు యత్నించాడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గత 25 రోజులుగా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ చౌరస్తాలో నిరసనలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈనెల 22 నుంచి పాదయాత్రలు చేపడుతామని వెల్లడించారు.
అదానీకి ఇస్తున్న డంపింగ్ యార్డును వ్యతిరేకించినందుకు సీబీసీఐడీ కేసులో విచారణ అంటూ బెదిరించారని పేర్కొన్నారు. తనను ఎవరూ ఎన్ని బెదిరింపులు చేసినా భయపడను కాక భయపడనని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చేలగాటమాడే బదులు రేవంత్ రెడ్డి నియోజకవర్గం అయిన కొడంగల్‌లో డంపింగ్ యార్డును పెట్టుకోవాలని సూచించారు. కొడంగల్ లో పెడుతున్న పరిశ్రమలు హుజురాబాద్ నియోజకవర్గంలో పెట్టాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతారని తెలిపారు. భూముల ధరలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఆదివారం డంపింగ్ యార్డు పెట్టే ప్రాంతంలో మల్లన్న దేవాలయం ఉందని, దానిని తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకొని తీరుతామని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం, కేంద్రంలో ఉన్న బండి సంజయ్‌కు , ఎంపీ ఈటల రాజేందర్‌కు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. డంపింగ్ యార్డుకు నిర్వహిస్తున్న ఆందోళను మద్దతు తెలుపాలని సూచించారు. డంపింగ్ యార్డు రద్దు విషయంలో వెనక్కి తగ్టే ప్రసక్తే లేదని, సీఐడీ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.