హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లుగా నియమితులైన వారు పండగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. సుమారు 500 మందికి రెండు నెలలు గడుస్తున్నా.. వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీలో భారీగా ఏర్పడిన ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన సంస్థ.. ఇటీవల ఔట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్లను ఏజెన్సీల ద్వారా నియమించింది. వారికి నెలకు రూ.22వేల జీతం అని చెప్పింది. కానీ అందులో సంస్థ భారీగా కోతలు పెడుతున్నారని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు డ్రైవర్లకు జీతాలు వస్తున్నా.. కండక్టర్లను మాత్రం అధికారులు కనికరించడంలేదని తెలుస్తున్నది. జీతాలు ఇవ్వక రెండు నెలలు అవుతున్నదని, బతుకమ్మ, దసరాకైనా ఇవ్వాలని అడిగితే.. ‘మీరు ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడో పోయాయి.. దరఖాస్తులు మళ్లీ ఇవ్వండి’ అని చెప్తున్నారని విలపిస్తున్నారు. అప్పటికే దరఖాస్తులు ఐదుసార్లు ఇచ్చామని వాపోతున్నారు.
ఆర్టీసీ బ్యాచ్‌ల వారీగా పలు ఏజెన్సీల ద్వారా సుమారు 1000 మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే 500 మంది వరకు ఉంటారని అంచనా. వీరి నుంచి ఏజెన్సీల ప్రతినిధులు నెలకు రూ.5వేలు వసూలు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేంటని అడిగితే.. ‘మిమ్మల్ని నియమించుకున్నందుకు మాకు కూడా డబ్బులు కావాలిగా’ అని ఏజెన్సీల ప్రతినిధులు చెప్తున్నట్టు తెలుస్తున్నది. ఇలా అక్రమంగా ఏజెన్సీలు వసూలు చేసే విషయం ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీలకు ఆర్టీసీ నిధులు ఇవ్వలేదా? ఆర్టీసీ ఇచ్చినా ఏజెన్సీలే ఆపుతున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ గొడ్డు చాకిరి చేయించుకుంటున్నదని ఔట్సోర్సింగ్ కండక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డ్యూటీలో కనీసం లంచ్ టైమ్ లేదని వాపోతున్నారు. 8 గంటలకు బదులుగా 12 గంటలకు పైగా పని చేయించుకుంటున్నారని తెలిపారు. డబుల్ డ్యూటీలకు రూ.650 అదనంగా చెల్లిస్తామని నమ్మించి.. ఇవ్వడం లేదని అంటున్నారు. యూనిఫాం డబ్బులు కూడా ఇవ్వడం లేదని చెప్తున్నారు. స్పెషల్ ఆఫ్‌లు పని చేయిస్తున్నారని, తర్వాతి రోజు డ్యూటీ చేస్తున్నా.. డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీ ఎక్కితే.. రాత్రి 12 గంటల వరకు పని చేయాల్సి వస్తున్నదని చెప్తున్నారు. గొడ్డు చాకిరీ చేయించుకుంటూ జీతాలకు సంబంధించి మాత్రం పైస్థాయి నుంచి అదేశాలు రాలేదని చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు.