హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 1నుంచి 12 తరగతుల సిలబస్ మార్పు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కొత్త కురిక్యులం రూపకల్పనకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పాలసీ రెడీ అయ్యే వరకు కొత్త సిలబస్ రూపకల్పన చేసే అవకాశాలు కనిపించడంలేదు. మొత్తంగా పరిస్థితి చూస్తుంటే డిసెంబర్ తర్వాతే సిలబస్ మార్పు షురూ కానుంది. రాష్ట్రంలో 1 -12 తరగతుల వరకు సిలబస్ మార్పునకు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరాయి. ఈ దశలోనే స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని వేసింది. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు సహా ఐఏఎస్‌లు, మరికొందరు ఈ కమిటీలో ఉన్నారు. ఇటీవలే కొన్ని సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈనెల 30లోగా ఈ కమిటీ సమగ్ర నివేదికను రూపొందించి సర్కారుకు సమర్పించాల్సి ఉంది.
డిసెంబర్లో పాలసీని విడుదల చేయనుండటంతో ఈ పాలసీని బట్టే కరిక్యులాన్ని సిద్ధం చేయాలి. అంటే డిసెంబర్ నుంచే సిలబస్ మా ర్పునకు కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు కమిటీలను వేయాలి. ఆ తర్వాత డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయాలి. దీనిని ప్రభుత్వం ఆమోదించాలి. ఆ తర్వాత కొత్త పుస్తకాలను ముద్రించాలి. ఇదంతా జూన్‌లోపే పూర్తికావాలి. వాస్తవానికి నవంబర్‌లోపు పాలసీ రెడీ అయితే జూన్‌లోపు పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తవుతుందన్న అంచనాలున్నాయి. 1- 10 తరగతుల్లో కొన్ని పుస్తకాలను ఆలస్యంగా అందజేస్తున్నారు.కొత్త కరిక్యులం సిద్ధం చేయడం, పుస్తకాలు అందజేయడం జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
1- 10 తరగతుల సిలబస్ మార్పు అంటేనే పెద్ద కసరత్తు. ఇందుకు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్) – 2023ను పరిగణనలోకి తీ సుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2014 తర్వాత కేసీఆర్ సర్కారు హయాంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేశారు. అప్పట్లో ఎన్సీఎఫ్ – 2005 ప్రకారం దశలవారీగా పుస్తకాల్లో మార్పులు చేశారు. ఎన్ఈపీ అమలు నేపథ్యంలో ఎన్సీఎఫ్ – 2023ను కేంద్ర విద్యాశాఖ కొంత కాలం క్రితం విడుదల చేసింది. ఈ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగానే కొత్త కరిక్యులం రూపొందించాల్సి ఉంది. తాజా పరిస్థితిని బట్టి చూస్తే, ప్రస్తుతం తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలను మినహాయించి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు సంబంధించి కొత్త కరిక్యులాన్ని రూపొందించే అవకాశాలున్నాయి.
ఇంటర్లో కెమిస్ట్రీ సిలబస్ అధికంగా ఉంది. 30 శాతం సిలబస్‌కు కోత విధించాలన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. జువాలజీ సిలబస్‌ను సైతం తగ్గించాల్సి ఉంది. ఎస్సీఈఆర్టీ (సీబీఎస్ఈ) సిలబస్ కన్నా తెలంగాణ ఇంటర్ సిలబస్సే అధికంగా ఉన్నది. సీబీఎస్ఈకి మించి మన దగ్గర సిలబస్ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జేఈఈ, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షలకు రాసే వారు అధికంగా కష్టపడాల్సి వస్తున్నది. ఇదే విషయంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.