Dense Fog | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలవారకముందే కొందరి బతుకులు తెల్లారిపోతుంటే.. మరికొందరి జీవితాలు అంధకారంలోకి జారుతున్నాయి. ప్రకృతికి అనుగుణంగానే వెళ్లాలే తప్ప.. వ్యతిరేకంగా వెళ్లవద్దని, అయినవాళ్లకు కన్నీరు మిగిల్చవద్దని తెలంగాణ పోలీసుశాఖ కోరుతున్నది. పొగమంచువేళ పౌరులు పాటించాల్సిన పలు జాగ్రత్తలను రైల్వే అండ్ రోడ్డుసేఫ్టీ ఏడీజీ కార్యాలయం విడుదల చేసింది. పొగమంచు వేళ వాహనాలను ఓవర్టేక్ చేయవద్దని పోలీసుశాఖ సూచించింది. ముఖ్యంగా తక్కువ స్పీడుతో వెళ్లడం, వాహనాల మధ్య దూరాన్ని పాటించడం వల్ల ప్రమాదాలను సాధ్యమైనంతవరకు నివారించవచ్చని తెలిపింది.