KCR | రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదని.. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను ఆగమేఘాలపై పని చేసి పనులన్నీ పూర్తి చేయించాం. పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. మూడున్నర లక్షల టన్నుల వడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయాం. వరంగల్ గడ్డ కోసం పెండింగ్‌లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ గడ్డకు నీరు తెచ్చుకున్నాం. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. వాగులు, వంకలపై చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికలు తీసుకున్నాం. ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం. పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం. ఆ నాడు బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు.. రైతుల కళ్లాల నిండా ధాన్య రాశులతో బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు’నన్నారు.
‘పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండించిన విషయం మీ అందరికీ తెలుసు. రైతు కష్టం ఏంటో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును. కావున రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. ఈ దేశంలో షేర్సా సూరీ అనే ఒక రాజు ఉండే.. ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చారు. చరిత్ర పొడుగుతా చూస్తే.. షేర్సా సూరీ నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా.. రైతుల వద్ద రకరకాల శిస్తులు వసూలు చేశాయి. రైతుల వద్ద డబ్బులు వసూలు చేశారు. తహసీల్ రకాలు వసూలు చేశారు. నీటి తీరువాలు వసూలు చేశారు కానీ.. రైతును చూడాలని ఎవరూ అనుకోలేదు. భారతదేశంలోనే ఎక్కడా లేనివిధంగా.. నన్ను ఎవరూ ఆడగలేదు. ఎన్నికల్లో చెప్పలేదు. నాకు నేనుగా ఆలోచించి.. ప్రభుత్వమే ఆలోచించి రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చాం. చాలా బ్రహ్మాండంగా రైతుబంధు పథకాన్ని అమలు చేశాం. రైతాంగానికి ఎటువంటి కరెంటు ఇచ్చాం? ఎంత అద్భుతమైన కరెంటును ఇచ్చాం? ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడారు? తెలంగాణ వస్తే కారు చీకట్లు అయితయ్.. మీకు కరెంట్ రాదు.. మీకు పంటలు పండియ్యరాదు అని చెబితే.. వాళ్ల నోర్లు మూయించేలా నాణ్యమైన కరెంటును 24గంటలు సరఫరా చేశాం’ అని గుర్తు చేశారు కేసీఆర్.
‘రైతులు ఇంట్ల కూసుంటే.. పొలాల కాడ బోర్లు దుంకినయ్. మీరంతా కండ్లారా చూశారు. నాకంటే ఈ విషయం మీకే ఎక్కువ తెలుసు. రెండెకరాలు.. మూడెకరాలున్న రైతులకు ఏముంటది ఆదాయం? బీఆర్ఎస్ రాక ముందు వారి చనిపోతే పట్టించుకున్న నాథుడు లేడు. బీఆర్ఎస్ వచ్చాక రైతుబీమా ఇచ్చి.. ఎనిమిదిరోజుల్లోనే కుటుంబాలకు బీమా అందేలా చర్యలు తీసుకున్నాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతుబంధు డబ్బులు ఎంత మంచిగ వచ్చేది? చినుకులు పడుతుంటే.. చకాచకా వచ్చి బ్యాంకుల్లో డబ్బులు పడి రైతుల సెల్ఫోన్లు మోగుతుండే. ఆవిధంగా కడుపులో చల్లకదలకుండా రైతాంగానికి రైతుబంధు అమలు చేసుకున్నాం. రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడారు. జై కిసాన్.. జై జవాన్ అన్నరు తప్ప.. వాళ్ల సంక్షేమం ఏ ప్రభుత్వం చూడలేదు’ అన్నారు.
‘అదేవిధంగా రైతులు ధాన్యం పండితే.. వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చినా.. ఏ ధాన్యం కొన్నమో.. వడ్లు కొంటే మూడునాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామో అవన్నీ యావత్ తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు. 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం ఎట్ల కొన్నమో మీకు తెలుసు. ఎన్నో పనులు చేశాం. మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదు. ఇంటింటా నల్లా పెట్టి ప్రజలకు మంచినీరు అందించడం జరిగింది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదు. మా అంతల మీమే మన రాష్ట్రం.. మన ప్రజలని.. వారిని బాగు చేసుకోవాలని పథకాలు అమలు చేశాం. చెరువుల్లో చేపలు పెంచాలని నన్ను ఎవరు అడిగారు ? వారికి వృత్తి పని దొరకాలని, మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువుల్లో చేపలు పెంచాం. లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ధర్నా చేయలేదు. ఎవరూ అడుగలేదు. ప్రభుత్వమే వారికి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాం’ అని వివరించారు కేసీఆర్.
‘పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాం. పెట్టుబడులు ఆకర్షించాం. సుమారు 20-25లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాం. 40కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను రూ.2.50లక్షల కోట్లకు పెంచగలిగాం. ఐటీ రంగంలో 7లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. వెయ్యికిపైగా గురుకులాలు తీసుకువచ్చాం. పేద విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాం. తెలంగాణలో మూడే మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. 33 కాలేజీలకు పెంచాం. బీఆర్ఎస్ హయాంలో మత కల్లోలం లేదు. కర్ఫ్యూ లేదు.. కల్లోలం లేదు. శాంతిభద్రతలన్నీ బ్రహ్మాండంగా కాపాడి.. ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవన్నీ నా డైలాగులు కాదు, స్టోరీలు కాదు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా అనేక సందర్భాల్లో వెల్లడించిన విషయాలు. ఆర్బీఐ, కాగ్ వెల్లడించిన అధికారిక లెక్కలేనని మీకు మనవి చేస్తున్నాం. నేను చెప్పివనన్నీ మీ కండ్ల ముందరే జరిగింది’ అన్నారు.