హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): షుగర్ వ్యాధి… ఈ పేరు వినని వారుండరు. ఇటీవల దాదాపు ఇంటికొకరైనా బాధితులు ఉంటున్నారు. ఇది నిరంతరం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన దీర్ఘకాలిక వ్యాధి. ఇందుకోసం మధుమేహులు తరచుగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు, 40ఏండ్లు దాటిన వారు కూడా సాధారణంగానే షుగర్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.
శరీరంలోని చక్కెర స్థాయిలు తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చేయాల్సి ఉం టుంది. కానీ రక్తం తీయకుండా, చెమట ద్వారా రక్తంలోని చక్కెర స్థాయి లెక్కించే డిజిటల్ పద్ధతిని హైదరాబాద్ బిట్స్ విద్యార్థులు ఆవిష్కరించారు.
అత్యాధునిక సాంకేతికతను విని యోగించి బిట్స్ హైదరాబాద్ విద్యార్థులు మరో ఘనత సాధించారు. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్ తెలుసుకొనే స్మార్ట్‌వాచ్ రూపొందించారు. ఈ స్మార్ట్‌వాచ్ ధరిస్తే చెమటను గ్రహించి, రక్తంలోని చక్కెర స్థాయిని లెక్కిస్తుందని విద్యార్థులు చెప్తున్నారు.
షుగర్ రోగులు రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవాల్సిన సమయంలో సూదితో గుచ్చడం వల్ల నొప్పిని భరించాల్సి వస్తుంది. స్మార్ట్‌వాచ్ ద్వారా నొప్పి నుంచి విముక్తి లభించడమే కాకుండా రక్తంలోని చక్కెరస్థాయి ఎప్పటికప్పుడు తె లుసుకునేందుకు స్మార్ట్‌వాచ్ ఉపయోగపడుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు.