తీవ్రంగా వ్యతిరేకించిన టీఈఈఏ
దేశవ్యాప్త సమ్మెకు దిగుతాం: టీఎస్‌పీఈఏ
ఎలాంటి పోరాటానికైనా సిద్ధమే: వీఏవోఏటీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విద్యుత్తు సవరణ చట్టం-2021ను తీసుకురానున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన ప్రకటనను తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు ఎన్ శివాజీ తెలిపారు. విద్యుత్తు సంస్థలు, ఉద్యోగులు, ప్రజల పాలిట మరణశాసనం కానున్న ఈ బిల్లును ఉపసంహరించుకొనే వరకు తీవ్రంగా పోరాడుతామని స్పష్టం చేశారు. విద్యుత్‌సౌధలో శుక్రవారం జరిగిన టీఈఈఏ కేంద్ర కార్యవర్గ అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం విద్యుత్తు అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నదని, దీనిపై తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పట్టించుకోకుండా బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.
డిస్కంలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే నరేంద్రమోదీ సర్కారు ఈ విధంగా వ్యవహరిస్తున్నదని, దేశ ప్రజలకు ప్రత్యేకించి రైతులకు వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొస్తున్నదని దుయ్యబట్టారు. విద్యుత్తు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేంద్రానికి తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. సమావేశంలో టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్యశెట్టి, ఇంజినీర్లు తుల్జారాంసింగ్, బందెల రవి, సంపత్ కుమార్, పున్నా నాయక్, లక్ష్మయ్య, సుశీల్‌కుమార్, తిరుపతయ్య, వెంకట్రామయ్య పాల్గొన్నారు.
సమ్మెకు దిగుతాం: టీఎస్‌పీఈఏ
విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా ఉన్న 27 లక్షల విద్యుత్తు ఉద్యోగులు సమ్మెకు దిగాల్సి వస్తుందని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసొసియేషన్ (టీఎస్‌పీఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రత్నాకర్‌రావు, పీ సదానందం హెచ్చరించారు.
విఫల విధానాలను సహించం: వీఏవోఏటీ
విద్యుత్తు సవరణ బిల్లు పేరుతో విఫల విధానాలను రుద్దితే ఊరుకోబోమని, ఈ విషయంలో పోరాటానికైనా సిద్ధమేనని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) రాష్ట్ర అధ్యక్షుడు పాపకంటి అంజయ్య స్పష్టం చేశారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా వీఏవోఏటీ నేతలు శుక్రవారం మింట్ కంపౌండ్‌లోని కార్యాలయంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సంఘం అధ్యక్షుడు డీ వీరాస్వామి, కార్యదర్శి కొండల వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ నాగరాజు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పీ అనిల్ పాల్గొన్నారు.