Dharani | హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘ధరణిని బంగాళాఖాతంలో పడేస్తాం’ అంటూ కాంగ్రెస్ పార్టీ గప్పాలు కొట్టడంతో భూ రికార్డుల నిర్వహణ, ఇతర అంశాలపై భారీ స్థాయిలో ప్రకటన ఏదైనా వస్తుందని, నూతన విధివిధానాలను ప్రకటిస్తారేమోనని ప్రజలు భావించారు. కానీ యథావిధిగా కాంగ్రెస్ పార్టీ తూచ్ అనేసింది. ధరణి స్థానంలో ‘భూ మాత’ పోర్టల్‌ను ప్రవేశపెడుతామని చెప్పుకొచ్చింది. ఇది కొత్త పోర్టలా? లేక ధరణి పేరు మార్చుతారా? ధరణి కన్నా భిన్నంగా ఏం చేయబోతున్నారనేది మాత్రం చెప్పడం లేదు. ఉదాహరణకు.. ధరణికి ముందు రాష్ట్రంలో మా భూమి అనే పోర్టల్ అందుబాటులో ఉండేది. అందులోని రికార్డులను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రక్షాళన చేసి, కొత్తగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ధరణిని పక్కనబెట్టి, ఎలాంటి యంత్రాంగాన్ని అమలు చేస్తారు? ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఏమిటి? అనేది మ్యానిఫెస్టోలో ఎక్కడా పొందుపరుచలేదు. కాంగ్రెస్ నేతలు సైతం వివరాలు చెప్పలేకపోతున్నారు. దీనిని బట్టి ధరణి పేరునే భూమాతగా మార్చుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
➣ ఈ ఏడాది జూలై 6న.. గాంధీభవన్‌లో ‘భూమి డిక్లరేషన్’ పేరిట 11 అంశాలతో ఓ భారీ ప్రకటన చేశారు. అయితే నాలుగు నెలల్లోనే భూమి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ మరిచిపోయింది. శుక్రవారం విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఇతర డిక్లరేషన్లను ప్రస్తావించారే తప్ప ‘భూమి డిక్లరేషన్’ ప్రస్తావన లేదు. ఇచ్చిన హామీలను నాలుగు నెలల్లోనే మరిచిపోతే.. ఇక భూ సమస్యలు ఎలా పరిష్కరిస్తారని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
➣ నిజామాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ భారతి పైలట్ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యిందని ప్రశ్నిస్తున్నారు. భూమాతను సైతం ఇదే తరహాలో తెస్తారా? అంటూ సందేహం వ్యక్తంచేస్తున్నారు.
➣ కోనేరు రంగారావు కమిటీ సిఫారసులు అమలు చేస్తామని చెప్పడంపై భూ చట్టాల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీ 2006లో రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని, 8 ఏండ్లు కొనసాగిందని, మరి అప్పుడు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
➣ ప్రభుత్వ భూములను కాపాడటానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని కూడా నిపుణులు ఎద్దేవా చేస్తున్నారు. లా కమిషన్ మాదిరిగా భూముల నిర్వహణకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేలా ఉండాలని సూచిస్తున్నారు. ఇక రైతుల భూముల హక్కులు కాపాడేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని, ట్రిబ్యునళ్లు భూ వివాద పరిష్కారానికి మాత్రమే పనిచేస్తాయని గుర్తు చేస్తున్నారు.
➣ అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రకటించారని, దానిని కాంగ్రెస్ కాపీ కొట్టిందని అంటున్నారు. మొత్తంగా మొదటి నుంచీ ధరణిని, భూ సమస్యలను బూచిగా చూపుతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజల ముందు ఉంచడంలో తీవ్రంగా విఫలమైందని స్పష్టం చేస్తున్నారు. ‘ఛూమంతర్’ అని మంత్రం వేస్తే అన్నీ మారిపోతాయి అన్నట్టుగా మ్యానిఫెస్టోలో పొంతన లేని హామీలు ఇచ్చి కిచిడీగా మార్చేసిందని ఎద్దేవా చేస్తున్నారు.