హైదరాబాద్: రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. తన పై కోపం ఉంటే తన నియోజకవర్గ రైతులను వేధించొద్దన్నారు. కేసీఆర్ పాలనతో ప్రతి ఎకరాకు నీరు అందిందని చెప్పారు. మంత్రి పొగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చిన్నచిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తలేరని వెల్లడించారు.
తన ఇంటిపైన దాడి చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. ఏడు నెలలైనా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం బాధాకరమన్నారు. నిర్లక్ష్యంవహించిన పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలి. హత్యామత్నం కేసు నమోదు చేసినా ఇంత వరకు అరెస్టు చేయలేదు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తనపైనే కేసు పెడతా అని డీసీపీ బెదిరించారని చెప్పారు.
సభలో తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మైత్రీ బంధం సభ సాక్షిగా మరోసారి బయటపడిందని చెప్పారు. కేంద్రం అనుమతులతో కట్టిన ప్రాజెక్టులపై బీజేపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన తీరు సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మండిపడ్డారు. భట్టి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.