King Fisher Beers | మందు బాబులకు షాకింగ్ న్యూస్ ఇది. తెలంగాణకు కింగ్ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూబీఎల్ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలను పెంచింది కానీ.. తయారీదారులకు చెల్లించే బేస్ ధరను పెంచకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని యూబీఎల్ తెలిపింది. బీర్ల సరఫరా నిలిపివేతకు ఇది కూడా ఒక కారణమని కంపెనీ పేర్కొంది. తెలంగాణ నుంచి రూ. 900 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ జాప్యం కూడా కంపెనీ నష్టాలకు కారణమైందని తెలిపింది. ఈ విషయాన్ని సెబీకి లేఖ ధ్వారా తెలిపింది.
సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 30 ప్రకారం.. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి తమ బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్ తన లేఖలో పేర్కొంది. టీజీబీసీఎల్ బీర్ల ప్రాథమిక ధరను 2019 నుంచి ఇప్పటి వరకు సవరించలేదని.. దీని కారణంగా రాష్ట్రంలో భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొంది. అలాగే.. బీర్ల సరఫరాకు సంబంధించి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చాలా బకాయి పడిందని.. ఆ బిల్లులు చెల్లించకపోవడంతో కంపెనీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఈ కారణంగా టీజీబీసీఎల్కి బీర్లను సరఫరా చేయడం సాధ్యం కాదని, ఇక నుంచి బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ తన లేఖలో స్పష్టం చేసింది. తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని యూబీఎల్ విజ్ఞప్తి చేసింది.
కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ అల్ట్రా, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్‌తో పాటు ఇతర బ్రాండ్లను నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ స్పష్టం చేసింది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలను పరిశీలిస్తే కింగ్ ఫిషర్ బ్రాండ్స్ 60 నుంచి 70 శాతం అధికంగా విక్రయం అవుతున్నట్లు తెలిపింది.