Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 25: శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఓయూను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. 28 ఏండ్ల వయసు దాటిన పీజీ విద్యార్థులకు హాస్టల్లో అడ్మిషన్లు నిరాకరిస్తుండటమే ఇందుకు తాజా నిదర్శనం. ఈ తుగ్లక్ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం కాకమ్మ కబుర్లు చెబుతూ దాటవేస్తున్నారు. దీనిపై విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పీజీ అడ్మిషన్లకు నిర్వహించే సీపీజీఈటీ నోటిఫికేషన్ జారీ సమయంలో హాస్టల్ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలను పేర్కొనలేదు. కనీసం కౌన్సెలింగ్ సమయంలో కూడా నిబంధనలను వెల్లడించలేదు. తీరా మూడు దశల కౌన్సెలింగ్ పూర్తయ్యాక 28 ఏండ్లు దాటిన వారికి హాస్టల్ వసతి కల్పించబోమని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని ఏ ఇతర యూనివర్సిటీల్లోనూ లేని ఈ నిబంధన ఓయూలో ఎందుకని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీని గురించి ముందే చెబితే తాము ఇతర యూనివర్సిటీల్లో చేరేవారమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నత చదువుల కోసం సాధారణంగా ఓయూకు వచ్చేది గ్రామీణ, నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే. వారిలో చాలా మంది కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక, ఇతర కారణాల వల్ల పాఠశాల స్థాయి విద్యాభ్యాసం ఆలస్యంగా మొదలవుతుంది. కొందరు 20 ఏండ్ల వయసు దాటిన తర్వాత పదవ తరగతి ఉత్తీర్ణులవుతుంటారు. ఓయూలో ఎప్పటికైనా ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో కష్టపడి సీటు సంపాదించి వచ్చిన విద్యార్థులకు వర్సిటీ అధికారుల సంకుచిత ధోరణి శరాఘాతంగా మారనున్నది.
హాస్టల్ ప్రవేశాల కోసం ఓయూ అధికారులను సంప్రదిస్తున్న ఎంతో మంది విద్యార్థులకు నిరాశే ఎదురవుతున్నది. వయోపరిమితి నిబంధనను వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించకుండా కేవలం తమ వద్దకు వచ్చిన వారికే సంబంధిత ఉత్తర్వులు చూపెడుతున్నట్టు సమాచారం. మరికొందరు విద్యార్థులకు కనీసం జవాబు కూడా ఇవ్వడం లేదని తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓయూ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఓయూ పరిధిలో అన్ని రకాల సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ ఈ ఏడాది ఆరంభంలో సర్క్యులర్ జారీ చేశారు. ఈ చర్యను రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కొన్ని నెలల పాటు ఆందోళనలు కొనసాగాయి. ఆ తర్వాత వర్సిటీలోని అన్ని కళాశాలలు, విభాగాల్లో నిర్వహించే అధికారిక సదస్సులకు తమ అనుమతి లేకుండా అతిథులను ఆహ్వానించకూడదని, పోస్టర్ రూపొందించే ముందే అనుమతి తీసుకోవాలని మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఆధ్వర్యంలో ఓయూ చాన్స్లర్ హోదాలో ఉన్న గవర్నర్కు సైతం ఫిర్యాదుచేశారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అధ్యాపకుల ప్రమోషన్లలో 48 మందికి ఉద్యోగోన్నతులు నిరాకరించారు. దీనిపై అధ్యాపకులు రెండు నెలలుగా నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
ఓయూలో ప్రవేశం పొందిన విద్యార్థులకు హాస్టల్ ప్రవేశాల విషయంలో వయోపరిమితి విధించడాన్ని ఖండిస్తు న్నాం. ఈ పరిమితి వల్ల సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.
– కొమ్ము శేఖర్, ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఓయూ హాస్టల్లో ప్రవేశానికి విధించిన వయోపరిమితి నిబంధన వెంటనే తొలగించాలి. సీపీజీఈటీలో అర్హత సాధించిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి. కష్టపడి చదివి వర్సిటీలో సీటు సంపాదిస్తే, ఇక్కడికి వచ్చేసరికి వయోపరిమితి నిబంధన తీసుకురావడం సరికాదు.
– కొమ్మనబోయిన సైదులు యాదవ్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉన్నత విద్య ను దూరం చేసే కుట్ర లో భాగంగానే ఓయూ అధికారులు ఈ నిర్ణ యం తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను హరించడమే.
– చటారి దశరథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్వీ