నా మీద ఎందుకు కేస్ పెడ్తరు? హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకా? లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూర్‌ను దాటి ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడ్తరు?
– కేటీఆర్
గతంలో జీనోమ్ వ్యాలీ పెడితే హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా మారింది. అట్లనే ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చాలనుకున్నం. అందుకే సియోల్, కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్ లాంటి నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్‌కు ఫార్ములా ఈ-రేస్‌ను తెచ్చినం. దీని నిర్వహణకు హెచ్ఎండీఏ ద్వారా ప్రభుత్వం రూ.55 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కానీ రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు తెలంగాణకు తెచ్చుకున్నం.
సర్కార్‌కు టార్గెట్ కేటీఆర్ కావొద్దు. టార్గెట్ ఆరు గ్యారెంటీల అమలుండాలె. టార్గెట్ వడ్ల కొనుగోళ్లు ఉండాలె. టార్గెట్ రైతుబంధు ఇవ్వడంలో, టార్గెట్ దళితబంధు చెల్లించడంలో ఉండాలె. టార్గెట్ యువతులకు స్కూటీలు ఇవ్వడంలో ఉండాలె. టార్గెట్ కల్యాణలక్ష్మి కింద ఇస్తానన్న బంగారం ఇవ్వడంలో ఉండాలె. టార్గెట్ గురుకులాలను బాగుచేయడంలో.. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో ఉండాలె.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తాను ఏ తప్పూ చేయలేదని, ఉడుత ఊపులకు బెదరనని, అక్రమ కేసులకు, జైళ్లకు భయపడనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. ‘ఫార్ములా-ఈ రేసు నిర్వహణపై ఏ విచారణకైనా సిద్ధం. అక్రమ కేసులతో, కక్ష సాధింపుతో నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతామంటే.. నేను రెడీ! రెండు నెలలు జైల్లో ఉండొచ్చి పాదయాత్ర చేస్తా’ అని అన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే ఉద్దేశంతో రూ.55 కోట్లు ఖర్చుచేసి ఈ-రేస్ నిర్వహిస్తే రాష్ర్టానికి రూ.700 కోట్ల లాభం జరిగిందని చెప్పారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రభుత్వంలో మంత్రిగా ఫండ్ ఇచ్చినట్టు స్పష్టంచేశారు. తాము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచితే ఈ-రేస్‌ను రద్దుచేసి రేవంత్‌రెడ్డి సర్కార్ అంతర్జాతీయంగా బ్యాడ్ ఇమేజ్ తెచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచినందుకు, హైదరాబాద్‌కు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసులు పెడ్తరా? అని నిలదీశారు.
రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒకటై బీఆర్ఎస్ను ఖతం చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు. కానీ, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలయ్యే వరకు రేవంత్‌రెడ్డి సర్కారును వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రేవంత్ గాసిప్స్‌ను పక్కనబెట్టి గవర్నరెన్స్ మీద దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఇందులో కరెప్షనో, కాకరకాయనో ఎక్కడున్నదని నిలదీశారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రీడల నిర్వహణకు ప్రభుత్వాలు నిధులు వెచ్చించడం సర్వసాధారణమని కేటీఆర్ చెప్పారు. ఇతర క్రీడల మాదిరిగానే మోటార్ కార్ రేసింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్నదని అన్నారు.
ప్రపపంచంలో మొట్టమొదటి కారు రేస్ 1894లో పారిస్‌లో, తొలిసారి ఫార్ములా-1 రేస్ 1946లో ఇటలీలో నిర్వహించారని గుర్తుచేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే ఫార్ములా-1 రేస్ జరిపారని చెప్పారు. ఫార్ములా-1 ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని, ఆ రేస్ నిర్వహణకు దేశాలే పోటీ పడతాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 24 రేస్‌లు నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశానికి ఫార్ములా-1 (ఎఫ్-1) రేసు రావాలన్న కల ఈనాటిది కాదని, రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు 2003లో ఎఫ్-1 రేస్ సీఈవోను కలిసి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించాలని కోరారని గుర్తుచేశారు.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా, 2011లోనే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అప్పటి మాయావతి ప్రభుత్వం 1700 కోట్లు వెచ్చించి దేశంలోనే తొలిసారిగా ఎఫ్-1 రేసును నిర్వహించారని కేటీఆర్ గుర్తుచేశారు. రాజీవ్‌గాంధీ హయాంలో 1984 ఏషియన్ గేమ్స్ ఢిల్లీలో నిర్వహించారని తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లో జరిగాయని, వీటి కోసం యూపీఏ ప్రభుత్వం రూ.70,608 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. వాస్తవ అంచనాకు 114 శాతం పెంచి భారీగా కుంభకోణానికి పాల్పడిన కేసులో కాంగ్రెస్ నేత సురేశ్ కల్మాడీ జైలుకు కూడా వెళ్లారని గుర్తుచేశారు.
ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్లు జరిగినా సరే ప్రభుత్వం వాటికోసం నిధులు ఖర్చు చేస్తుందని, చేయాల్సిందేనని చెప్పారు. 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసం కూడా రూ.103 కోట్లు నాటి ఉమ్మడి ఏపీ సర్కారు ఖర్చు చేసిందని, ఆ సందర్భంలోనే గచ్చిబౌలి స్టేడియం నిర్మాణం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. తమిళనాడులో జరిగిన ఫార్ములా-4 రేసు కోసం రూ.42 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఎఫ్-1 రేసు నిర్వహిస్తున్నందునే మొరాకో అనే చిన్న దేశం ప్రపంచం మొత్తానికి తెలిసిందని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి గురువు కలను మేం నెరవేర్చాం. శిష్యుడు మాత్రం నెరవేర్చలేదు. చంద్రబాబు దాంతో ఆగలేదు. ఎఫ్-1 కండక్ట్ చేయడానికి గోపన్‌పల్లి ప్రాంతంలో 1500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. చివరకు 400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి డెడికేటెడ్ ట్రాక్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ 400 ఎకరాల్లో కూడా రేవంత్‌రెడ్డి భూమి ఉంది. భూసేకరణకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. మేం భూములు ఇవ్వబోమంటూ రైతులు కోర్టుకు వెళ్లారు. సర్వే నంబర్ 127లో 31 ఎకరాల భూమి ఇప్పటికీ ఉన్నది. ఆ కేసు ఇంకా నడుస్తున్నది.
-కేటీఆర్
ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో మోటార్ రేసింగ్ జరిగితే అకడ కశ్మీర్‌ను ప్రమోట్ చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి కూడా మోటార్ రేసింగ్ అభిరుచి ఉన్నదని, అందుకు తాను అభినందిస్తున్నానని తెలిపారు. యమహా మోటార్ రేసింగ్‌లోనూ ఆయన పాల్గొన్నారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తెలంగాణలో ఎఫ్-1 రేసు నిర్వహిస్తే.. కొత్త రాష్ర్టానికి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎంతో ప్రయత్నించిందని, కానీ ఇండియాకు రావడంపై ఆసక్తి లేదని వాళ్లు చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. భవిష్యత్తు తరాలకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)లను ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు వచ్చిందని, ఫార్ములా రేసింగ్‌లోనూ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో చేసే రేసింగ్‌ను ఫార్ములా ఈ-రేస్ అంటారని చెప్పారు. ఎఫ్-1 రేసు రాని కారణంగా తాము ఫార్ము లా ఈ-రేస్ తెచ్చే ప్రయత్నం చేశామని తెలిపారు.
ఈ-రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతున్నందున ఈ నగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టాలనే సదుద్దేశంతో ఈ-రేస్‌ను ఇకడికి తెచ్చే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ క్రమంలో సియోల్, కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్ పోటీ పడ్డాయని, వాటిని తలదన్ని మన హైదరాబాద్‌కు ఈ-రేస్‌ను తెచ్చామని చెప్పారు. ఫార్ములా ఈ-రేస్‌ను ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది వీక్షిస్తారని చెప్పారు. దేశంలో పుణె, చెన్నై ఆటోమొబైల్స్ స్థావరాలుగా మారాయి.. హైదరాబాద్ ఈవీ హబ్‌గా మారాలనే లక్ష్యంతో 2022 జూలై 11 న జీవో ఇచ్చామని చెప్పారు. 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించామని తెలిపారు. ఫార్ములా ఈ-రేస్‌కు కేంద్ర మంత్రులు, ఎంపీలు వచ్చారని.. ఇందులో తమ భాగస్వామ్యం కూడా ఉన్నదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు.
ఫార్ములా రేసింగ్‌ను తాము ఒక రేసింగ్‌గా మాత్రమే చూడలేదని, దాని ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మన హైదరాబాద్‌ను అడ్డాగా మార్చాలని సంకల్పించామని తెలిపారు. అందుకు ఫార్ములా ఈ-రేసింగ్‌ను ఒక అడుగుగా భావించామని తెలిపారు. గతంలో పెట్టిన జీనోమ్ వ్యాలీ ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్‌ను రాజధానిగా చేసిందని గుర్తుచేశారు. అదేవిధంగా ఈ-రేస్‌తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కేంద్రం అంటే హైదరాబాద్ అనేలా మార్చాలని భావించామని చెప్పారు. లండన్, పారిస్, రోమ్ వంటి విశ్వనగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టాలనుకున్నట్టు చెప్పారు. మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కూడా ఈ-రేస్‌కు కమిటీలో మెంబర్‌గా, సలహాదారుగా నియమించామని చెప్పారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతోపాటు మన హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా చేద్దామని ప్రభుత్వం అనుకున్నట్టు తెలిపారు. మొబిలిటీ వీక్‌లో భాగంగా అన్ని కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
ఈ-రేస్ నిర్వహణ కోసం మొత్తం 150 కోట్లు ఖర్చు కాగా, హెచ్ఎండీఏ ద్వారా ప్రభుత్వం కేవలం రూ.55 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని కేటీఆర్ చెప్పారు. కానీ, ఈ-రేస్ వల్ల రూ.700 కోట్ల వరకు పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని వివరించారు. ఈ-రేస్ ద్వారా హైదరాబాద్‌కు వచ్చిన ప్రయోజనం రూ.700 కోట్లు అని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన వార్తను మీడియాకు చూపించారు. ఈ-రేస్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని చెప్పారు. అమర్‌రాజా బ్యాటరీస్, హ్యుందాయ్ అనేవి కూడా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాయని చెప్పారు.
మరో సంస్థ రూ.1200 కోట్లు పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ఫార్ములా ఈ-రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ.2,500 కోట్లు పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. ఫార్ములా ఈ-రేస్ ద్వారా వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతూ ప్రాచుర్యం కూడా పెరిగిందని పేర్కొన్నారు. బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చామని, దేశంలోనే తొలిసారిగా ఈవీ పాలసీని తెచ్చామని వివరించారు. ఈ-రేస్‌ను రేస్‌గా కాకుండా మొత్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఈవీ యూనివర్సిటీ టెక్నాలజీని పెంపొందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కోసం హోస్ట్సిటీగా హైదరాబాద్ (హెచ్ఎండీఏ), గ్రీన్కో, ఎఫ్ఐఏ మూడు సంస్థలతో నాలుగేండ్లకు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్కో సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పకకు తప్పుకున్నట్టు తెలిపారు. ‘మాకు లాభమే రాలేదని ఒప్పందం నుంచి గ్రీన్కో సంస్థ తప్పుకున్నది. మనకు వాళ్లు డబ్బులు ఇచ్చిందీ లేదు. మనం వాళ్లకు డబ్బులు ఇచ్చిందీ లేదు. ఇక్కడ అవినీతి లేదు, మన్నులేదు మశానం లేదు. ఇక్కడ కరప్షనో, కాకరకాయనో అసలే లేదు’ అని కేటీఆర్ చెప్పారు.
గ్రీన్కో సంస్థ వెళ్లిపోవటంతో ఈ-రేస్ నిలిచిపోకుండా ఉండేందుకు ఆ డబ్బులను మనం ఇద్దామని నాటి మున్సిపల్ కమిషనర్ అర్వింద్‌కు చెప్పానని కేటీఆర్ గుర్తుచేశారు. వాళ్లకు స్పాన్సర్లు దొరకకపోవటంతో ప్రమోటర్ దొరికే వరకు తానే భరోసా ఉంటానని చెప్పానని, ప్రభుత్వం తరఫున ఆ డబ్బు ఇద్దామని అన్నానని స్పష్టంచేశారు. హెచ్ఎండీఏకు తెలియకుండా తాము డబ్బులు ఇచ్చామని అంటున్నారని.. కానీ హెచ్ఎండీఏకు ఈ విషయం పూర్తిగా తెలుసునని పేర్కొన్నారు.
ఈ విషయమై నవంబర్ 14న జీవో కూడా ఇచ్చామని కేటీఆర్ వెల్లడించారు. ఈ-రేస్‌ను తాము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు రూ.55 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇందులో అప్పటి పట్టణాభివృద్ధి, పురపాలకశాఖల ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తప్పేమీ లేదని, తానే మొత్తానికి బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు. అరవింద్ ఫైల్ పంపితే మంత్రిగా సంతకం పెట్టానని తెలిపారు. పురపాలకశాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంటర్నల్‌గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చని, ఇది సాధారణమేనని అన్నారు. హెచ్ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డు అని, దానికి చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ పురపాలకశాఖ మంత్రిగా తాను మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా రూ.55 కోట్లు కట్టమని అర్వింద్‌కుమార్‌కు చెప్పానని తెలిపారు. దీనికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదని పేర్కొన్నారు.
ఈ-రేస్ నిర్వహించి 49 దేశాల్లో తెలంగాణ పేరు తెలిసేలా చేశామని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎంతో పెంచామని కేటీఆర్ చెప్పారు. 2022 నవంబర్‌లో ఫార్ములా-4 రేస్, 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించామని, ఒకే ట్రాక్‌పై రెండు రేసులు జరిపామని పేర్కొన్నారు. ఎన్నో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నమూ చేశామని తెలిపారు. కూలగొట్టుడు, విధ్వంసం చేయటమే వాళ్లకు తెలిసినపని అని, నిర్మాణం చేయటం వారికి తెలియదని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. రెడ్డొచ్చె మొదలాయె అన్నట్టు.. హైదరాబాద్ ఈ-రేస్‌ను రద్దు చేయటంతో.. జాగ్వార్, నిస్సాన్ లాంటి సంస్థలే దీనిని సిగ్గుచేటు చర్యగా అభివర్ణించాయి. రేవంత్‌రెడ్డి దికుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ ఇజ్జత్ పోయింది. రాష్ర్టానికి రూ.700 కోట్ల నష్టం వాటిల్లింది’ అని తెలిపారు. తాము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచితే, రేవంత్‌రెడ్డి ఈ-రేస్ రద్దుచేసి బ్యాడ్ ఇమేజ్ తెచ్చారని మండిపడ్డారు.
నిజానికి హైదరాబాద్‌లో ఈ-రేస్ రాకుండా మన నగరం ఇమేజ్ దెబ్బ తీసినందుకు రేవంత్‌రెడ్డిపైనే కేసు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘ఏసీబీ ఫుల్‌ఫామ్ రేవంత్‌రెడ్డికి తెలుసా? అవినీతి జరిగితే ఏసీబీని వాడాలి. కానీ ఇకడ అవినీతి ఏమున్నది? ఇందులో నాకొచ్చింది ఏమున్నది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినవద్దని నేను ప్రభుత్వపరంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రూ.55 కోట్లు ఖర్చు చేయించాను. మరి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటున్నడు. ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతదో తెలుసా? దాదాపు 3 లక్షల కోట్లు ఖర్చవుతాయి. నిర్వహించిన కార్యక్రమానికి 55 కోట్లు ప్రభుత్వపరంగా ఖర్చుచేస్తేనే గగ్గోలు పెడుతున్న రేవంత్‌రెడ్డి.. 3 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒలింపిక్స్ నిర్వహిస్తడట’ అని కేటీఆర్ అన్నారు.
ప్రభుత్వానికి నిజంగా కేసు పెట్టాలని ఉంటే ఎవరిమీద పెట్టాలె? మేఘా కంపెనీ మీద పెట్టాలె. మేఘా కృష్ణారెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టే దమ్ముందా రేవంత్‌రెడ్డికి? రాఘవ కంపెనీ, మేఘా కంపెనీలకు కేకులు కోసిచ్చినట్టు ఇచ్చిన పనులకు సంబంధించి కేసులు పెట్టాలె. రూ.50 లక్షల నగదు బ్యాగుతో దొరికిన రేవంత్‌రెడ్డిపై కేసు నమోదై ఎనిమిదేండ్లయినా ఎలాంటి చర్యలు ఎందుకు లేవు?
– కేటీఆర్
‘నామీద ఎందుకు కేసు పెడ్తరు? హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు పెడ్తవా? హైదరాబాద్‌కు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇకడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? పారిపోతున్న కంపెనీలను కాపాడినందుకా?’ అని కేటీఆర్ మండిపడ్డారు. ‘టార్గెట్ కేటీఆర్.. అంటూ ఇవ్వాళ ఒక పేపర్లో రాశారు. కానీ, సర్కార్‌కు టార్గెట్ కేటీఆర్ కాదు.. టార్గెట్ ఆరు గ్యారెంటీల అమలుండాలె. టార్గెట్ వడ్ల కొనుగోళ్లు ఉండాలె. టార్గెట్ రైతుబంధు రైతులకు ఇవ్వడంలో ఉండాలె. టార్గెట్ దళితబంధు సొమ్ము చెల్లించడంలో ఉండాలె. టార్గెట్ యువతులకు స్కూటీలు ఇవ్వడంలో ఉండాలె. టార్గెట్ కల్యాణలక్ష్మి కింద ఇస్తానన్న తులం బంగారం ఉవ్వడంలో ఉండాలె. టార్గెట్ గురుకులాలను బాగు చేయడంలో ఉండాలె. టార్గెట్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ రెండోవిడత విడుదల చేయడంలో ఉండాలె’ అని కేటీఆర్ హితవు పలికారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలిపింది కేసీఆర్ అయితే, ఆ విజన్‌ను రేవంత్‌రెడ్డి దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయించడమే తమ టార్గెట్ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ఉడుత ఊపులకు బెదరబోమని, అక్రమ కేసులకు, జైళ్లకు భయపడబోమని చెప్పారు. ఏ విచారణకైనా తాము సిద్ధమేనని స్పష్టంచేశారు.‘రేవంత్‌రెడ్డి కనీసం తెలుసుకో. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతియ్యకు. కాదు కూడదని అక్రమంగా కేసు పెట్టాలనుకుంటే పెట్టుకో. కక్షసాధింపుతో జైల్లో పెడితే.. బయటకువచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తా. అంతేతప్ప బెదిరేది లేదు. ఏం చేసుకుంటావో చేసుకో! ప్రభు త్వం రోజుకో రకంగా దుష్ప్రచారం చేస్తున్నందుకే ఏం జరిగిందో నేనే ప్రజలకు చెప్తున్న. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒకటై బీఆర్ఎస్ను ఖతం చేయాలని అనుకుంటున్నాయి. గవర్నర్ విచారణకు అనుమతిస్తే స్వాగతిస్తా. తప్పు చేయలేదు ఏ విచారణకైనా సిద్ధం. నేను దేనికైనా రెడీగా ఉన్నాను. ప్రజల తరఫున పోరాటం ఆగదు. కొనసాగుతూనే ఉంటుంది’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
‘ఈ రేస్ రద్దుతో హైదరాబాద్‌కు నష్టం కలిగించిన రేవంత్‌రెడ్డి మీద కేసు పెట్టాలె. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీసినందుకు. రేవంత్‌రెడ్డిది తెలివితకువ నిర్ణయం. ఆగస్టు 25న ఇదే రేవంత్‌రెడ్డి.. 2036 ఒలిపింక్స్‌ను ఇకడికి తెస్తనని నరికిండు. ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చయితదో తెలుసా ఈ సీఎంకు? 2016 ఒలిపింక్స్‌కు రియోలో నిర్వహిస్తే అక్కడి ప్రభుత్వం లక్షా 8 వేల కోట్లు, 2020లో నిర్వహణకు టోక్యో ప్రభుత్వం 2.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ఖర్చు మన రాష్ట్ర బడ్జెట్‌తో సమానం. 55 కోట్ల ఈ రేసింగ్ నిర్వహిస్తేనే ఒర్రుతున్న ఈ మొగోడు.. ఒలింపిక్స్ నిర్వహిస్తడట. నీ ముఖానికి అయితదా? అంతర్జాతీయ ప్రమాణాతో ఈవెంట్ నిర్వహించడం అంటే ఏందో తెలుసా?’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
రేవంత్ సీఎంగా ఎన్నికైన వెంటనే మెట్రో ప్రాజెక్ట్ రద్దు, ఫార్మా సిటీ రద్దు అంటూ ప్రకటనలు చేశారు. మేం బ్రాండ్‌ఇమేజ్‌ను క్రియేట్ చేస్తే.. రేవంత్‌రెడ్డి బ్యాడ్ ఇమేజ్ తీసుకొస్తున్నారు. విశ్వనగరం ఇమేజ్ లేకుండా చేస్తే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తాయా?. నా మీద కోపంతో అందులో నాకేదో దక్కిందనుకొని.. ఏమీ తెలుసుకోకుండా ఈ-రేస్‌ను రద్దు చేశారు.
– కేటీఆర్
‘నన్న ఏసీబీ విచారిస్తుందట. ఏసీబీ ఫుల్‌ఫామ్ తెలుసా రేవంత్‌రెడ్డికి? తెలుసనుకో.. బ్యాగులతో తిరిగినోడికి ఎందుకు తెల్వదు. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. ఏసీబీని కరప్షన్‌కు వ్యతిరేకంగా వాడాలి. ఇందులో కరప్షనో, కాకరకాయనో ఏడున్నది. నేనడుగుతున్నా చెప్పు? ఫార్ములా-ఈ రేస్ హైదరాబాద్‌లో ఉండాలని చెప్పి హెచ్ఎండీఏ నుంచి రూ.55 కోట్లు పంపిన మాట వాస్తవం. దాంట్ల నేను ఏమైనా దాచుకుంటినా? నాకేమైనా వచ్చినయా?’అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘చేతనైతే మేఘా ఇంజినీరింగ్ మీద పెట్టు కేసు. సుంకిశాలలో గోడ కూలిపోయింది 80 కోట్లు నష్టం వచ్చింది. దమ్ముంటే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి మేఘా కృష్ణారెడ్డి ఇంటి మీదికి ఏసీబీని పంపు. ఈస్టిండియా కంపెనీ అన్నవ్ కదా.. మొగోనివైతే దానిమీద ఏసీబీ కేసు పెట్టు. అవసరమైతే 50 లక్షలతో దొరికిన బ్యాగ్మెన్ మీద ఏసీబీ కేసు పెట్టు. ఇవాళ రేస్ రద్దు చేయడం కారణంగా జరిగిన నష్టానికి రేవంత్ మీద ఏసీబీ కేసు పెట్టాలి. మేం హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినం. నువ్వు బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసినవ్. మేం బ్రాండ్ ఇమేజ్ తెస్తే నువ్వు బర్బాద్ చేసినవ్. హైడ్రా పేరుతో విశ్వనగరం విజన్‌ను దెబ్బతీస్తున్నావ్’ అని రేవంత్‌పై కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం పెట్టుబడులను ఆకర్షించడం కోసం 55 కోట్లు ప్రభుత్వంలో మంత్రిగా ఫండ్ ఇచ్చినట్టు కేటీఆర్ స్పష్టంచేశారు. ‘ఫార్ములా ఈ-రేస్ కోసం ప్రభుత్వం 35 నుంచి 40 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ ఈకో సిస్టంకి ఒనగూరిన ప్రయోజనం 700 కోట్లు. ఫార్ములా-ఈ రేస్ వల్ల మొబిలిటీ వ్యాలీ ద్వారా అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్లు, హ్యుందాయ్ 1400 కోట్లు, బిలిటీ 1200 కోట్లు, ఫార్ములా ఈ రేస్ ద్వారా మరో 2,500 కోట్లు పెట్టుబడులుగా వచ్చాయి. నీ చేతగానితనం వల్ల ఈ రేస్ రద్దవడంతో తీవ్ర నష్టం జరిగింది. అవినీతే లేనప్పుడు ఏసీబీతో కేసులెందుకు? ఎవరి మీద పెడుతవ్? పెట్టాల్సి వస్తే నీ మీదనే ముందు కేసు పెట్టాలి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో రేవంత్! గాసిప్స్ కాదు గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, ఇప్పటికే హైదరాబాద్ ఇమేజ్ మొత్తం దెబ్బతిన్నది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇన్ని చెప్పినా కూడా నేను కక్ష సాధిస్తా, కేసు పెడ్తా అంటే నీకు ఇష్టమొచ్చిన కేసు పెట్టుకో భయపడేవారెవరూ లేరు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.