హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఎక్కడా అవినీతి, లంచగొండితనం జరిగినట్టు పేర్కొనలేదని సాగునీటిరంగ నిపుణుడు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా ఎవరి మీదైనా ఆరోపణలు చేయడానికి అవకాశం లేదని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కమిషన్ నివేదికలో విధాన, ఆర్థిక, సాంకేతికపరమైన లోపాలను మాత్రమే ప్రస్తావించిందని చెప్పారు. కానీ ఎక్కడా అవినీతి జరిగిందన్న మాటే లేదని తెలిపారు. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగిన ఘటన నిర్మాణపరమైన, ప్రణాళికాపరమైన లోపమే తప్ప, అవినీతితో సంబంధం లేదని అన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. 141 టీఎంసీల నీటిని నిల్వ చయగలదు. ఇవన్నీ లాభాలే. అవినీతి కాదు’ అని పేర్కొన్నారు.
ప్రాణహిత-చేవెళ్లతో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి రూ.80 కోట్లకుపైగా వరకు పెరగడం సబబేనని ప్రకాశ్ పేర్కొన్నారు. 2007లో పథకానికి రూపకల్పన చేసినప్పుడు 12.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.17,875 కోట్ల ఖర్చు అంచనా వేశారన్నారు. తర్వాతి సంవత్సరం చేవెళ్ల నియోజకవర్గం చేర్చడంతో విస్తీర్ణం 16.40 లక్షల ఎకరాలకు, ఖర్చు రూ.38,500 కోట్లకు పెరిగిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసిన తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంగా మారిందని అన్నారు. దీని ప్రకారం సాగువిస్తీర్ణం 37 లక్షల ఎకరాలకు, భవిష్యత్తులో 45 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టును రీడిజైన్ చేశారని తెలిపారు. రీడిజైనింగ్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు రావాలంటే తప్పనిసరిగా స్టోరేజీ సామర్థ్యాన్ని 141 టీఎంసీలకు పెంచాల్సి వచ్చిందని అన్నారు. ఇలా సాగువిస్తీర్ణం పెంపు, సొరంగాల విస్తరణ, అధిక సామర్థ్యం ఉన్న పంపుల వినియోగం, అదనంగా రిజర్వాయర్ల నిర్మాణం, 18 శాతం జీఎస్టీ వంటి అంశాల వల్ల ఖర్చు పెరిగిందని వివరించారు. ‘ఏ ముఖ్యమంత్రి అయినా తొమ్మిదేండ్ల తర్వాత ఇలాంటి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఖర్చు రూ.80 వేల కోట్లకు పెరగడం సహజం. ఇందులో అవినీతి ఎక్కడుంది?’ అని ప్రశ్నించారు.
విచారణలో భాగంగా తాను పలుమార్లు కమిషన్ ముందు హాజరయ్యానని వీ ప్రకాశ్ గుర్తు చేసుకున్నారు. తాను నివేదికను ఒకటికి రెండుసార్లు పూర్తిగా అధ్యయనం చేశానని, ఎక్కడా తన వాంగ్మూలం, తన పేరు ఈ నివేదికలో కనిపించలేదని చెప్పారు. ‘కమిషన్ తనకు అవసరమైనది మాత్రమే తీసుకొని, ముందే సిద్ధం చేసుకున్న కథనాన్ని వండివార్చింది’ అని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆధారాలను చూపాలని డిమాండ్ చేశారు.