సంగారెడ్డి జూలై 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నిహితుడైన ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.20 లక్షలు తీసుకొని పోక్సో కేసు నుంచి సైకో రాజ్‌కుమార్‌ను తప్పించారని, పోలీసులు కూడా బెయిల్ వచ్చేలా పోలీసులు వ్యవహరించారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పోలీసులను రాజకీయ కక్ష సాధింపులు, ల్యాండ్ సెటిల్మెంట్ల కోసమే వాడుకొంటున్నారు తప్ప.. ప్రజల రక్షణ కోసం కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్స్టేషన్లు ల్యాండ్సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో శాంతిభద్రతలపై పట్టింపులేకుం డా పోయిందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ నాయకులు, బీఎల్వోలకు ‘సర్’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. షాబాద్ ఘటనతో సీఎంకు చీమకుట్టినైట్లెనా కాలేదని ధ్వజమెత్తారు. షాబాద్ ఘటనపై పక్కరాష్ట్రం సీఎం స్పందించినా ఇప్పటి వరకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ నాయకుల పీకలు కోసి రక్తాన్ని చల్లితే పంటలు పండుతాయంటూ మాట్లాడిన రేవంత్‌రెడ్డికి సైకో రాజ్‌కుమార్‌కు తేడా ఏమున్నదని ప్రశ్నించారు.
మూసీ ముద్దు.. బసవేశ్వర వద్దా?
కమిషన్ల కోసం మూసీ ముద్దు అంటున్న రేవంత్‌రెడ్డి నారాయణఖేడ్ రైతులకు సాగునీరు ఇచ్చే బసవేశ్వర ఎత్తిపోతల పథకం మాత్రం వద్దంటున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ ప్రారంభించిన బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినట్టు చెప్పారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలంటూ త్వరలోనే నారాయణఖేడ్ నుంచి జహీరాబాద్ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నారాయణఖేడ్‌లో తాగునీరు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, శశిధర్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, శివకుమార్, మా ణిక్యం, మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు.