హైదరాబాద్ :కృష్ణాబోర్డు (Krishna Board Meeting ) పరిధిలో నీటి పంపకాల విషయంలో శుక్రవారం జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్సీల (Engineers-in-Chiefs, ) సమావేశం మరోసారి వాయిదా ( Postponed ) పడింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయి నిర్వహించి నీటి వాటాల విషయంలో నిర్ణయం తీసుకోనుంది.
50 శాతం వాటా అడిగాం : తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు
ఈ సందర్భంగా తెలంగాణ తరుఫున పాల్గొన్న ఈఎన్సీ సభ్యుడు రమేష్ బాబు ( Ramesh Babu ) మాట్లాడుతూ తాగునీటిపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చ జరిగిందని వివరించారు. ఎల్ నినో ఉన్నందున తాగునీటి కోసం చేరో 50శాతం వాటా తీసుకోవాలని తెలంగాణ కోరగా ఏపీ పాత పద్ధతిన 66:34 వాటా లెక్కన పంపిణి చేయాలని డిమాండ్ చేసిందని వెల్లడించారు. 66:34 నిష్పత్తి డిమాండ్ ను మూడేళ్లుగా తాము అంగీకరించడం లేదని తెలిపారు.
ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను తీసుకపోతోందని, ఇప్పుడు వెలిగొండ నుంచి కూడా నీరు తీసుకుంటున్నారని వివరించారు. మొత్తం తెలంగాణ 200 టీఎంసీలు, ఏపీ 100 టీఎంసీలను అడిగిందని అన్నారు.సెప్టెంబర్ నాలుగో వారంలో జరిగే బోర్డు సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో అవసరం లేకున్నా శ్రీశైలం వద విద్యుత్ ఉత్పత్తి : ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి
ఏపీ ఈఎన్సీ సభ్యుడు నరసింహమూర్తి మాట్లాడుతూ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. 66:34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణకు నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని కోరామని తెలిపారు. ఎల్ నినో ఉన్నందున తాగునీటి కోసం 50:50 నిష్పత్తిలో ఇవ్వాలని తెలంగాణ కోరిందని, వచ్చే ఆగస్టు వరకు 104 టీఎంసీలు కావాలని కోరామని వివరించారు. తెలంగాణ 200 టీఎంసీలు కావాలని కోరిందని, ఆ ప్రతిపాదన సహేతుకం కాదని చెప్పామని వెల్లడించారు.
తెలంగాణ అవసరం లేకున్నా శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని సమావేశంలో ఆరోపించామన్నారు. తమ వాటా నుంచే పోతిరెడ్డి పాడు, వెలిగొండ ద్వారా నీరు తీసుకుంటున్నామని, ఎవరి వాటా అడగడం లేదని తెలిపారు.రాయలసీమతో పాటు మార్కాపురం, పల్నాడు, ఇతర జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం నీరు ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు.