న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ అక్రమాలకు పాల్పడినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Kharge) ఆరోపించారు. ఆయన్ను వెంటనే తొలగించాలని అన్నారు. ఎన్నికల అధికారిపై వత్తిడి తెచ్చిన ప్రధాని మోదీ కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కూడా ఖర్గే డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరిగిన అక్రమాలపై పార్లమెంట్‌తో పాటు వీధుల్లోనూ ఆందోళన చేపట్టనున్నట్లు ఖర్గే తెలిపారు. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో ఖర్గే మొత్తం అయిదు డిమాండ్లను లేవనెత్తారు. ఎలక్టోరల్ రోల్స్ కోసం జరిగిన డేటా మార్పులను, డిలీట్ అయిన ఓటర్ల మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఎలక్టోరల్ రోల్స్‌కు చెందిన ఫార్మాట్‌ను సరళమైన రీతిలో అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలని ఖర్గే కోరారు.