కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 27: కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావుపై సోమవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతికి అవిశ్వాస నోటీసులు అందజేశారు. ఇటీవల మేయర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అవిశ్వాస నోటీసులు అందించింది. ఆ నోటీసులపై బీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు.
బీఆర్ఎస్కు చెందిన డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌తో కలిసి 26 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లతోపాటు ఆరుగురు కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు సైతం సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు రాజేందర్రావు, మహేశ్, మాధవి, స్వరూపారాణి మాట్లాడుతూ.. పార్టీ మారిన మేయర్‌పై ఎంత వ్యతిరేకత ఉన్నదో ప్రజలకు తెలిపేందుకే ఈ అవిశ్వాస నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.
మంగళవారంతో పాలకవర్గ పదవీకాలం ముగుస్తుందన్న విషయం తెలుసని, మేయర్ తీరుపై కార్పొరేటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చెప్పేందుకే ఈ చర్య తీసుకున్నామని స్పష్టం చేశారు. అవినీతిపరుడైన సునీల్‌రావు స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సరికాదని హితవుపలికారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. తమ పార్టీలో చేరాలంటే పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారని, ఇప్పుడు సునీల్‌రావును మేయర్ పదవికి రాజీనామా చేయకుండా ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.