హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని డీజీపీ జితేందర్ ఉద్ఘాటించారు. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డీజీపీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని చెప్పా రు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఓ ప్రకటనలో డీజీపీ ప్రజలను కోరారు.
శాంతిభద్రతలపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఇటీవల నెలకొన్న పరిస్థితులపై సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడంపై సీఎం సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అకసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్గా వ్యవహరించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.