హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదా ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి తమకు ఫిర్యాదు అందలేదని సీబీఐ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎస్పీ కల్యాణ్ చక్రవర్తి కౌంటర్ దాఖలు చేశా రు. కాళేశ్వరం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమైనందున దర్యాప్తు జరిపే పరిధి సీబీఐకి లేదని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఆదేశిస్తేనే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగలమని వివరించారు. ఒకవేళ కాళేశ్వరంపై తాము దర్యాప్తు చేయాల్సివస్తే మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, అం దుకు అవసరమైన వనరులు తమ వద్ద లేవని, వాటిని రాష్ట్ర ప్రభుత్వమే కల్పించేలా చూడాలని కోరారు. అందులో భాగంగా ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, తగిన సిబ్బందితోపాటు ఆఫీసు, వాహనాలను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై హైకోర్టు ఫిబ్రవరి 25న విచారణ జరుపనున్నది.