Chandran-3 Landing | జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో స్కూళ్లను తెరిచి ఉంచే విషయమై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం స్కూళ్ల పని వేళల్లో ఎటువంటి మార్పు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం (ఆగస్టు 23) నాడు చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో ‘చంద్రయాన్ లైవ్ టెలికాస్ట్’ కోసం సాయంత్రం 6.30 గంటల వరకు స్కూళ్లు నడపాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
అయితే గురుకులాల్లో విద్యార్థులకు ప్రొజెక్టర్ సాయంతో గానీ, కే యాన్ గానీ, టీవీ ద్వారా గానీ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. మిగతా పాఠశాలల విద్యార్థులు ఇండ్ల వద్ద టీవీల్లో గానీ, మొబైల్ ఫోన్లలో గానీ చూడమని అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం సాయంత్రం చూడలేని విద్యార్థులకు తర్వాతీ రోజు (ఆగస్టు 24) స్కూల్‌కి రాగానే చూపాలని ఆదేశించారు. చంద్రయాన్ కార్యక్రమాన్ని వీక్షించడానికి విద్యార్థులను పాఠశాల బయటికి తీసుకెళ్ల వద్దని హితవు చెప్పారు. చంద్రయాన్ ప్రాముఖ్యతను వివరించాలని తెలిపారు.
బుధవారం సాయంత్రం జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగిడనున్నది. ఈ అపూర్వ ఘట్టాన్ని విద్యార్థులంతా లైవ్‌లో వీక్షించేలా స్కూళ్లు, విద్యా సంస్థల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లాల డీఈఓలు, స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులను తెలంగాణ విద్యాశాఖ ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి టీ-శాట్ ఛానెల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్ కానున్నది.