Ration Cards | హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఏ విధానంలో అర్హులను ఎంపిక చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. సర్వే చేసి, గ్రామసభల్లో చర్చించిన తర్వాతే అర్హులను ఎంపిక చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు అంతా ఉత్తవేనని తేలిపోయింది. గ్రామసభల నిర్వహణకు ముందే అర్హుల జాబితాను ప్రభుత్వం ఫైనల్ చేసింది. ఇప్పటికే ఆ జాబితాను క్షేత్రస్థాయి అధికారులకు అందజేసింది. దీనినే మొక్కుబడిగా గ్రామసభల్లో పెట్టి మమ అనిపించేందుకు రంగంసిద్ధమైంది. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్‌కార్డులకు అర్హులను గుర్తిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సర్వే పూర్తి కాలేదు. స్పష్టత లేని సర్వే ఆధారంగా అర్హులను ఏవిధంగా గుర్తిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వారం ముందే అధికారులకు జాబితా
కొత్త రేషన్‌కార్డు పొందేందుకు అర్హుల జాబితాను ప్రభుత్వం వారం క్రితమే క్షేత్రస్థాయి అధికారులకు అందజేసింది. ఈ జాబితాను దేని ఆధారంగా, ఏ విధంగా రూపొందించారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఈ జాబితానే ఫైనల్ అనే ప్రచారం జరుగుతున్నది. దీంతో భారీ సంఖ్యలో అర్హులకు రేషన్‌కార్డుల జారీలో కోత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు డిసెంబర్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్‌కార్డుల కోసం సుమారు 10 లక్షల దరఖాస్తులు, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు మరో 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తం 20 లక్షల దరఖాస్తులున్నాయి. అయితే, ప్రభుత్వం 5-6 లక్షల కొత్త కార్డులు మాత్రమే ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ఏరియాలో ఒక వార్డులో సుమారు 10 వేల మంది కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం పంపించిన జాబితాలో 140 మంది పేర్లు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. ఈ విధంగా అన్నిచోట్లా భారీ సంఖ్యలో కోతలు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చేరికలు, తీసివేతలు లేనట్టేనా?
కొత్త రేషన్‌కార్డులు ఇస్తామంటున్న స ర్కారు… పాత కార్డుల్లో కుటుంబసభ్యుల చేరిక, పేర్ల తీసివేతలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో మరింత గందరగోళం నెలకొన్నది. కొత్తగా పెండ్లి అయిన వారు, వేరుపడిన వారు సుమారు 10 లక్షల మంది చేరికలు, తీసివేతలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ పాత కార్డులో పేరుంటే అందులో వారి పేరు తొలగించకుండా కొత్త కార్డు రాదు. దీంతో అర్హులైనప్పటికీ వారికి కొత్త కార్డు మంజూరు కాదు. కొత్తగా పెండ్లి అయనవారు తమ పిల్లల పేర్లను రేషన్‌కార్డులో చేర్చాలన్నా వీలుకాని పరిస్థితి నెలకొన్నది.
జాబితాలో మా పేర్లేవి?
ప్రభుత్వం పంపించిన అర్హుల జాబితా గ్రామాలకు చేరడంతో దానిని చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. రేషన్‌కార్డు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను నిలదీస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.