Mulugu | హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. పలు గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో వరద నీటిలో బోటులో వెళ్లి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మల్యాల, కొండాయి, గోవిందరాజుకాలనీల్లో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడ్డ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ పెద్ద సాహసమే చేశాడు. దొడ్ల గ్రామం వద్ద బోటులో జంపన్న వాగు దాటి అక్కడ్నుంచి 2 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాడు ఆ డాక్టర్. అనంతరం ప్రజలకు చికిత్స అందించి తిరుగు ప్రయాణమయ్యాడు.
మల్యాల, కొండాయి, గోవిందరాజుల గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి గత వర్షాకాలం కూలిపోగా, ఇంతవరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బోటు ద్వారానే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. సీతక్క ఎన్నికల ముందు చుట్టం చూపుకు వస్తుంది తప్ప, సంవత్సరం నుండి బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని బాధిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.