హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : కార్మిక చట్టాల సవరణ యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు బీజేపీ స్వస్తి పలకాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాలు బుధవారం నిర్వహించిన భారత్ బంద్‌కు ఆమె మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ కూడా భారత్‌బంద్‌కు మద్దతిచ్చినట్టు గుర్తుచేశారు. హైదరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నదని మండిపడ్డారు.
దురదృష్టవశాత్తు 2014 నుంచి కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు సవరించి బ్యాక్‌డోర్ విధానాలకు తెరలేపిందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 17న తెలంగాణ జాగృతి నిర్వహించ తలపెట్టిన రైల్‌రోకో నిరసన కార్యక్రమానికి జాతీయ యాదవ హకలు పోరాట సమితి, సోమవంశీ ఆర్య క్షత్రియ సమాజ్ ఉన్నతి మండల్ సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు మేకల రాములుయాదవ్, సోమవంశీ ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు చంద్రకాంత్ చవాన్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు కవిత ను కలిసి మద్దతు లేఖలను అందజేశారు. హైదరాబాద్ హెచ్ఎంటీ కాలనీలో కల్తీ కల్లు ఘటనలో మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.