TG Budget | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆర్థికంగా, సా మాజికంగా విప్లవాత్మక మార్పులకు కారణమైన పలు పథకాలకు కాంగ్రెస్ సర్కార్ మంగళం పాడినట్టే కనిసిస్తున్నది. 2026-27 బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఇదే అభిప్రాయం ఏర్పడుతున్నది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలందుకున్న పథకాలను సైతం పక్కనబెట్టడంపై విస్మ యం వ్యక్తమవుతున్నది.
కేసీఆర్ కిట్, విదేశీ వి ద్యానిధి, పల్లె, పట్టణ ప్రగతి, ఆరోగ్యలక్ష్మీ, దళితబంధు, బీసీ, మైనారిటీ బంధు, గొర్రె పిల్లల పం పిణీ, చేపపిల్లలు, మత్స్యకారులు, వృత్తిదారుల కు పనిముట్ల పంపిణీ తదితర పథకాలను అటకెక్కించింది. దీంతో కేసీఆర్‌పై కక్షతోనే ఆయన ఆనవాళ్లను చెరిపివేయాలని రేవంత్ సర్కార్ యత్నిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి.
ఆర్థికంగా వెనుకబడ్డ ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపే సమున్నత లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2021లో దళితబంధు పథకానికి అంకురార్పణ చేసింది. ఒక్కో దళితకుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. 40 వేల కుటుంబాలకు పథకం మంజూరు చేసిం ది. మరో 1.3 లక్షల కుటుంబాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. దశలవారీగా దళిత కుటుంబాలన్నింటికీ అందించాలనే లక్ష్యంతో 2022-23 బడ్జెట్లో ఒక్కో నియోజకవర్గానికి రూ.300 కోట్లు కేటాయించింది. కాగా కాంగ్రెస్ ప్రతి కుటుంబానికి అంబేద్కర్ అభయ హస్తం కింద రూ.12 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, మూడో బడ్జెట్లోనూ నిధులు కేటాయించలేదు.
తెలంగాణ పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం 2019లో పల్లె ప్రగతి, 2020లో పట్టణ ప్రగతి పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులోభాగంగా మొదట పది రోజులపాటు ఊరూరా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. పారిశుధ్య పనుల్లో భాగంగా రోడ్లు, డ్రైనేజీలను శుద్ధిచేసింది. ఫాగింగ్, మొక్కల పెంపకం, పాడుబావులు, పాడుబడ్డ ఇండ్ల కూల్చివేతలు, లూజ్ కరెంట్ లైన్లను సరిచేయడం తదితర పనులు చేపట్టింది. తద్వారా పల్లెలు, పట్టణాల్లో వసతులు మెరుగుపడ్డాయి. సీజనల్ వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గింది. వెరసీ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఈ పథకంలో భాగంగా పల్లెలు, పట్టణాలకు జనాభా ప్రాతిపదికన ప్రతినెలా ఠంఛన్‌గా నిధులు మంజూరు చేసింది. కాంగ్రెస్ సర్కార్ ఈ స్కీమ్‌లను కూడా పక్కనపెట్టింది.
ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకు విదేశీ విద్యను అందించాలనే ఆశయంతో కేసీఆర్ ప్రభుత్వం విదేశీ విద్యానిధి స్కీమ్‌ను ప్రారంభించింది. బీసీలకు జ్యోతిబాఫూలే, ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ పేరిట వేలాదిమందికి రూ.25 లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు చేసింది. ఈ స్కీమ్ కు కాంగ్రెస్ నిధులు కేటాయించలేదు. మొ దటి, రెండు విడతల్లో సాయం అందుకు న్న విద్యార్థులు మిగిలిన విడతల మంజూ రు కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థికంగా చేయూతనందించకుంటే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు.
బాల్య వివాహాలు, శిశు మరణాల తగ్గింపులో కీలకపాత్ర పోషించిన కేసీఆర్ కిట్ స్కీమ్‌కు వరుసగా మూడో బడ్జెట్లోనూ నయాపైసా కేటాయించలేదు. ఈ స్కీం కింద మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలతోపాటు తల్లీ, శిశువులకు అవసరమైన సబ్బు, పౌడర్, చీర, ఇతరత్రా సామగ్రితో కిట్ అందించింది. ఉచిత అంబులెన్స్‌ల ద్వారా వారిని ఇండ్లకు చేర్చింది. కాగా కాంగ్రెస్ ఈ సర్కార్ స్కీమ్‌కు మంగళంపాడింది.
మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ న్యూట్రిషన్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. పేద మహిళలకు పోషకాహారంతో కూడిన కిట్లను ప్రతినెలా అందజేసింది. కాంగ్రెస్ సర్కార్ పథకాన్ని అటకెక్కించింది. పోషకాహార కిట్ల సరఫరాను నిలిపివేసింది.
