Minister Srinivas Yadav | కాంగ్రెస్‌తో పొత్తనే మాటే ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కిషన్‌రెడ్డి అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో చేసిన అభివృద్ధి గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. అంబర్‌పేటలో చేసిన అభివృద్ధిపై అంబర్‌పేట ఎమ్మెల్యే రెడీగా ఉన్నారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గంటకో మాట మాట్లాడుతున్నారని, మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. వెంకటరెడ్డి పొద్దున ఒక మాట.. సాయంత్రం మరో మాట మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌తో పొత్తు అనే మాటే లేదని, బీఆర్ఎస్ పార్టీకి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలమైన, తెలంగాణ ప్రజల పార్టీ అన్నారు. కోమటిరెడ్డి స్టాండర్డ్స్ లేని వ్యక్తి అని, ఆయన వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. పార్టీలు మారిన వాళ్లు.. బీఆర్ఎస్ను వీడిన వాళ్లు ఎలా ఉన్నారో ప్రజలు చూస్తున్నారన్నారు. నోరుంది కదా? అని తాడు బొంగురం లేకుండా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు.
20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా అంబర్‌పేటకు కిషన్ రెడ్డి ఉన్నారని, అభివృద్ధిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమని, కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి వస్తారా? లేదా? అనేది ఆయనకే తెలియాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎవరిపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయదని, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా ఉందన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, మా సెక్రటేరియట్ ప్రారంభానికి ఇవ్వలేదన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవస్థను ఎలా నడుపుతోందో దేశం అంతా గమనిస్తోందన్నారు. సెక్రెటేరియట్ కట్టడం చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారన్నారు. సెక్రెటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్‌లో అందరికీ తెలుస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై వాళ్ల పార్టీ నేతలు ఏం అంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ లో ఎంపీగా ఉండి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీకి ఓట్లు వేయమన్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ డివిజన్ల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని మతాలు, అన్ని వర్గాలు, దేవాలయాలు, చర్చ్‌లు, మసీద్‌లలో ప్రత్యేకంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. పెద్దమ్మ దేవాలయంలో మేయర్, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో డిప్యూటీ మేయర్ ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. చండీయాగం, ఆయుష్ హోమం, బల్కంపేట ఆలయంలో రాజశ్యామల యాగం, హైదరాబాద్ నెక్లెస్ రోడ్ థ్రిల్ సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.