గంగాధర, సెప్టెంబర్ 20 : బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌లో భాగంగా ప్రవేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అక్టోబర్ 4వ తేదీ నుంచి పాఠశాలలోకి అనుమతించబోమని కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు పంపింది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉచితంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సంబంధించిన ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తున్నదని, కానీ గత రెండేండ్ల నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని యాజమాన్యం లేఖలో పేర్కొన్నది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రెండేండ్లుగా బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి విద్యాభోదన చేశామని, అప్పులు ఎక్కువ కావడంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపింది. రాజకీయ నాయకులు, అధికారులు డబ్బులు ఇప్పిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదని వివరించింది. దీంతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌లో భాగంగా ప్రవేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను వచ్చే నెల 4వ తేదీ నుంచి పాఠశాలలోకి అనుమతించడంలేదని లేఖలో పేర్కొన్నది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని విద్యార్థులు
తల్లిదండ్రులు కోరుతున్నారు.