హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 15 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనను వెంటనే తొలగించి పాతపద్ధతినే అనుసరించాలని బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించని నిబంధన లక్షలాది మంది విద్యార్థులకు పెనుభారంగా మారనున్నదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు సకాలంలో బస్సులు నడవక, మెరుగైన రవాణా సదుపాయాలు లేక, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య వల్ల విద్యార్థులు సమయానికి హాజరు కాలేని పరిస్థితులు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకొనే ప్రమా దం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉదయం 8:45 గంటలలోపు హాజరు కావాలనే నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు.
‘మాడల్ స్కూల్’లో ఇద్దరిపై వేటు ; విద్యార్థులతో పనులు చేయించడంపై చర్యలు
కాటారం, మార్చి 2 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం మాడల్ స్కూ ల్లో విద్యార్థులతో పనులు చేయించారన్న ఘటనలో ఎట్టకేలకు ఇద్దరిపై వేటు పడింది. పాఠశాల ఉపాధ్యాయుడు మనోహర్ సస్పెండ్ కాగా, అటెండర్ బానోత్ కేక్యనాయక్ను విధుల నుంచి తొలగిస్తూ డీఈవో రాజేందర్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల కిందట స్కూల్‌కు మధ్యాహ్న భోజనం కోసం వచ్చిన బియ్యం బస్తాలను దించే క్రమంలో విద్యార్థులతో పనులు చేయించారు.