హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఈ నెల 24న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే వారి హాల్టికెట్లను అధికారులు బుధవారం విడుదల చేశారు. ఆయా హాల్టికెట్లను https //bse.telangana. gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఆధారంగా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
నేడు ఎంప్లాయీస్ జేఏసీ నిరసనలు
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ గురువారం ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.