హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మూడు జిల్లాల డీఈవోలపై వేటుపడింది. నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల డీఈవోలను విద్యాశాఖ బదిలీచేసింది. నిజామాబాద్ డీఈవో దుర్గాప్రసాద్, నిర్మల్ జిల్లా డీఈవో రవీందర్‌రెడ్డి సుధీర్ఘకాలంగా అదే జిల్లాలో కొనసాగుతుండటం, వారిపై పలు ఆరోపణల రావడంతో వారిని బదిలీ చేశారు. అయితే మహబూబాబాద్ జిల్లా డీఈవో రాజేశ్వర్ ఆ పోస్టుపై ఆసక్తిచూపకపోవడంతో బదిలీచేసి ఆయన స్థానంలో రవీందర్‌రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఇక నిర్మల్ జిల్లా డీఈవోగా కే నాగజ్యోతి, నిజాబాబాద్ జిల్లా డీఈవోగా అశోక్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఇక దుర్గాప్రసాద్‌కు మాడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా డీఈవో ఏ రవీందర్‌రెడ్డి నాలుగేండ్లుగా అదే జిల్లాలో డీఈవోగా కొనసాగుతున్నారు. ఈ జిల్లాలోని కొందరు టీచర్లు బిట్‌కాయిన్స్‌లో పెట్టబడులు పెట్టడంతోపాటు ఎన్వోసీ లేకుండా విదేశీపర్యటనలకు వెళ్లారు.
ఈ వ్యవహారంలో ఆయన చూసిచూడనట్టుగా వ్యవహరించారని, పరోక్షంగా వారికి సహకరించారన్న ఆరోపణలున్నాయి. టీచర్ల బదిలీల్లోనూ ఈ జిల్లాలో అవినీతి జరిగినట్టుగా తెలిసింది. ఇక నిజామాబాద్ జిల్లాలో స్కూళ్ల అనుమతుల విషయంలో పలు ఆరోపణలున్నాయి. అలాగే ఓ కేజీబీవీ స్పెషలాఫీసర్ ఆక్రమ డిప్యూటేషన్ వివాదాస్పదమైంది. ఈ విషయంలో డీఈవో వైఖరిపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రెస్మీట్లు పెట్టి అప్పట్లో ఆరోపణలు గుప్పించాయి. నిజామాబాద్ జిల్లాలో 900 మందికి పదోన్నతులు కల్పించగా, 100కు పైగా పదోన్నతులపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దుర్గాప్రసాద్ సైతం తనను ఉపాధ్యాయ సంఘాలు ఇబ్బంది పెడుతున్నాయని.. మానసిక వేదనకు గురిచేస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ఈ ఇద్దరిపై విద్యాశాఖ బదిలీవేటు వేసింది.