ఖలీల్‌వాడి ఆగస్టు 22: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోమారు నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కుల కులాన్ని తక్కువ చేసి అవమానించారు. వారి వేషధారణను కించపరిచేలా మాట్లాడారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. బుడబుక్కల కులంపై నోరు పారేసుకున్నారు. వెంటనే తప్పును సరిదిద్దుకునేందుకు క్షమాపణ కోరారు. మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో బుడుబుక్కల పదం వాడానని, ఆ కులాన్ని ఉద్దేశించి అనలేదని, కేటీఆర్ వేషధారణ అందుకు సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతోనే అన్నానని వివరణ ఇచ్చుకున్నారు. అర్వింద్‌కు మొదటి నుంచి నోటి దురుసు ఎక్కువే. ఐదురోజుల్లో పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ రైతులను మోసం చేసిన ఘనత ఆయన సొంతం.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై అర్వింద్ తరచూ అవాకులు చెవాకులు పేలుతుంటారు. ఆ విమర్శలను గులాబీ నేతలు పెద్దగా పట్టించుకోకపోవడంతో దాడిని మరింత తీవ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓపిక నశించిన ఎమ్మెల్సీ కవిత.. అర్వింద్‌కు రెండు, మూడుసార్లు గట్టిగానే సమాధానమిచ్చారు. మరోసారి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని హెచ్చరించారు. ఎక్కడ పోటీ చేసినా వెంటాడి మరీ ఓడిస్తానని స్పష్టం చేశారు. అయినా అర్వింద్ తీరు మారడం లేదు. అంతేకాదు.. ఎన్నికల్లో కారుకు ఓటేసినా, కాంగ్రెస్‌కు ఓటేసినా.. ఇంకా ఇతరులకు ఎవరికి వేసినా బీజేపీ పువ్వు గుర్తుకే పడుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యవస్థపైనే అనుమానాలు కలిగేలా మాట్లాడిన అర్వింద్ తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.