TG IPASS | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు కావాలి. అందుకు కంపెనీలు రావాలి. అది జరుగాలంటే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. అందుకు సులభతర వ్యాపారం చేసే సుహృద్భావ వాతావరణం కల్పించాలి. అలాంటి వాతావరణం ఉండాలంటే మౌలిక సదుపాయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు వేగవంతమైన అనుమతులకు మార్గం ఉండాలి. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ మనస్సులో మెదిలిన ఈ ఆలోచనలకు కార్యరూపమే.. టీజీఐపాస్ (తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్). సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) అనుమతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీజీఐపాస్ను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలువురు నిపుణులు ప్రశంసించారు. తాజాగా కేంద్రప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్ కూడా టీజీఐపాస్ను దేశంలోనే ఉత్తమ విధానాల్లో ఒకటిగా కొనియాడింది. ఈ మేరకు ‘డిజైనింగ్ ఏ పాలసీ ఫర్ మీడియం ఎంటర్ప్రైజెస్’ పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
15 రోజుల్లోనే అనుమతులు
ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి దేశంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల్లో టీజీఐపాస్ ఒకటని నీతిఆయోగ్ ప్రశంసించింది. టీజీఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈ అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించడంతోపాటు తనిఖీలను కనిష్టస్థాయికి చేర్చినట్లు తన నివేదికలో పేర్కొంది. సింగిల్ విండో పద్ధతిలో లభించే అనుమతులకు 15 రోజుల గడువును నిర్థారించడాన్ని నివేదిక కొనియాడింది. తద్వారా అనవసర జాప్యాలు లేకుండా వ్యాపారాలు ప్రారంభించడానికి, విస్తరించడానికి ఈ చట్టం దోహదపడుతున్నదని తెలిపింది. వ్యాపారంలో ఏర్పడే సంక్లిష్టతలను కూడా ఈ విధానం తగ్గించినట్టు చెప్పింది. చట్టబద్ధమైన నిబంధనల అమలులో స్వీయధ్రువీకరణను ఈ విధానం అనుమతిస్తున్నదని గుర్తుచేసింది.
తనిఖీల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో వ్యాపార విస్తరణకు దోహదపడినట్టు ప్రశంసించింది. మొత్తంగా టీజీఐపాస్ను దేశంలోనే ఉత్తమ విధానాల్లో ఒకటిగా తేల్చిచెప్పింది. టీఐడియా, టీప్రైడ్ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలతోపాటు జనరల్ కేటగిరీ వారికి, మహిళలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. అంతేకాకుండా పరిశ్రమల కోసం భూమి కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీని 100 శాతం రీయంబర్స్ చేయడంతోపాటు పరిశ్రమలకు వివిధ రకాల సబ్సిడీలను ఈ చట్టం ద్వారా అందిస్తున్నట్టు నీతి ఆయోగ్ ప్రశంసించింది. కాగా నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ గతంలో అనేక సందర్భాల్లో టీజీఐపాస్పై ప్రశంసలు కురిపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషిచేస్తున్నదని కొనియాడారు.
అలా టీజీఐపాస్కు శ్రీకారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్ర బహుముఖాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే వ్యవసాయరంగ అభివృద్ధికి నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించిన విధంగానే పారిశ్రామికీకరణ కోసం అత్యుత్తమ చట్టాన్ని తేవాలని నిశ్చయించారు. నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలీడేలతో సతమతమవుతున్న పరిశ్రమల రంగాన్ని గట్టెక్కించడమే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలపాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే సమస్యలు తెలుసుకునేందుకు పరిశ్రమ వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిది గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పారిశ్రామికవేత్తలు తమకు నిరంతర విద్యుత్తు ఇవ్వాలని కోరారు. అనుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, మితిమీరిన జాప్యాన్ని నివారించాలని ఈ సందర్భంగానే విజ్ఞప్తిచేశారు. దీంతో కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీజీఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
వెల్లువెత్తిన పెట్టుబడులు
దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఆన్లైన్లోనే దరఖాస్తులు, అనుమతులు రావడంతో పరిశ్రమ వర్గాల్లో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. దీనికితోడు మండు వేసవిలో సైతం రెప్పపాటు కూడా కరెంటు పోకపోవడంతో బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో నడిచాయి. దీంతో దేశవిదేశాల నుంచి రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ పేరుగాంచింది. ప్రపంచంలోని అనేక పేరుగాంచిన పరిశ్రమలు, ఐటీ, ఔషధ కంపెనీలు రాష్ర్టానికి క్యూకట్టాయి. అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పెట్టుబడుల కోసం జరిపిన విదేశీ పర్యటనల సందర్భంగా టీజీ ఐపాస్ గురించి వివరించగానే ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి విధానం లేదని ప్రశంసలు కురిపించారు. టీజీఐపాస్ కారణంగా రాష్ర్టానికి పరిశ్రమలు క్యూకట్టాయి. టీజీఐపాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ విధానం ద్వారా 27,424 కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. ఇందులో 24,771 కంపెనీలు తయారీరంగానికి చెందినవి కాగా సేవారంగానికి చెందిన కంపెనీలు 2,648గా ఉన్నాయి. మొత్తంగా రూ. 2,99,974.04 కోట్ల పెట్టుబడులు రాగా, 18,83,746 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
టీజీఐపాస్ గ్రేట్
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న టీజీఐపాస్ అద్భుతం. ఈ విధానానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తే అధ్యయనం చేస్తాం.
-కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (27.08.2020)
టీజీఐపాస్ అద్భుతం
టీజీఐపాస్ అద్భుతం. 12 రోజుల్లోనే మా సంస్థకు అనుమతులిచ్చారు. ఇది నూతన పారిశ్రామిక విధాన శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. కేసీఆర్ గారూ
మీ నాయకత్వం అద్భుతం.
-ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ (30.06.2015)
లక్షల మందికి ఉపాధి
టీజీఐపాస్తో తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమైంది. రాష్ర్టానికి కంపెనీలు క్యూకట్టాయి. లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. -ఎంఎస్ఎంఈ ఈపీసీ, బిల్మార్ట్ ఫిన్టెక్ సంయుక్త అధ్యయనం (16.06.2022)
తెలంగాణ పాలసీ భేష్
తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ అద్భుతంగా ఉంది. ఇక్కడ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉన్నది. భారత్-అమెరికా వాణిజ్యానికి హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉన్నది.
-అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్ (10.01.2023)
దేశంలోనే అత్యుత్తమం
టీజీఐపాస్ పరిశ్రమలకు సత్వర అనుమతులను ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీజీఐపాస్ దేశంలోనే అత్యుత్తమ చట్టం. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమల అభివృద్ధికి సర్కారు కృషి గొప్పగా ఉన్నది.
-భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత చైర్మన్ సీకే రంగనాథన్ (27.10.2021)
టీజీఐపాస్తో ఏం జరిగిందంటే?
టీజీఐపాస్ ఎప్పుడు.. ఎలా?
టీజీఐపాస్ ప్రత్యేకతలు
సింగిల్విండో విధానం: పరిశ్రమకు అవసమైన అన్ని అనుమతులు, ప్రోత్సాహకాలు ఒకేచోట ల్యాప్టాప్ ఉంటే చాలు: ఇంటినుంచి కాలు బయట పెట్టకుండానే దరఖాస్తులు, అనుమతులు అన్నీ ఆన్లైన్లోనే