TASK | బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)కు నీతి ఆయోగ్ ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంలో నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మా ప్రభుత్వం చేసిన కృషికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సోషల్ మీడియాలో నీతి ఆయోగ్ నివేదిక గురించి ప్రస్తావిస్తూ, టాస్క్ ద్వారా తెలంగాణ యువత, విద్యార్థులకు కలిగిన ప్రయోజనాలను గుర్తు చేశారు.
2014లో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో టాస్క్‌ను ప్రారంభించి, అనేక విజయాలు సాధించిందని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా, టాస్క్ ద్వారా పారిశ్రామిక వర్గాలు, విద్యారంగం, ప్రభుత్వాలను కలుపుతూ, నాణ్యమైన మానవ వనరుల తయారీకి, శిక్షణకు టాస్క్ ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. టాస్క్ సాధించిన విజయాలను నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ యువత కోసం స్కిల్లింగ్ రంగంలో చేసిన సేవకు దక్కిన గుర్తింపని ఆయన అభివర్ణించారు.
గత పది సంవత్సరాలలో టాస్క్ సంస్థ అనేక గొప్ప విజయాలు సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా 761 కాలేజీల్లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందని, 9.84 లక్షల మంది విద్యార్థులకు, 18,650 మంది ఫ్యాకల్టీకి శిక్షణ అందించిందని ఆయన గుర్తు చేశారు. సుమారు 80 పారిశ్రామిక సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుని, 35 వేల మందికి పైగా విద్యార్థులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని కేటీఆర్ తెలియజేశారు. నైపుణ్యవంతమైన తెలంగాణను ఏర్పాటు చేసే దిశగా టాస్క్ సంస్థ ఆవిర్భావం, దాని పనితీరు ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.
నీతి ఆయోగ్ ప్రశంసలు
నీతి ఆయోగ్ తన నివేదికలో టాస్క్ యొక్క పనితీరును గొప్పగా ప్రశంసించింది. స్కిల్లింగ్ రంగంలో అందరికీ అవకాశాలు అందేలా, విద్యార్థులకు ఉద్యోగాలు అందేలా, నైపుణ్యం కల్పించేలా టాస్క్ గొప్పగా పని చేసిందని నివేదికలో తెలియజేసింది. ముఖ్యంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి టాస్క్ సంస్థ ద్వారా ఎంతగానో లబ్ధి చేకూరిందని పేర్కొంది. పారిశ్రామిక వర్గాల అవసరాలకు అనుగుణంగా టాస్క్ ఇచ్చిన శిక్షణ వల్ల విద్యార్థులు, యువత ఉపాధి అవకాశాలను సులభంగా పొందగలిగారని, టాస్క్ యొక్క పనితీరును నీతి ఆయోగ్ అభినందించింది.