హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): అక్షయ పాత్రలాంటి రైతుబంధు పథకాన్ని భిక్షగా అభివర్ణించి, అన్నదాతలను భిక్షగాళ్లతో జమకట్టిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. చరిత్రలో రైతులను అవమానించిన వారెవరూ ఇంతవరకు బాగుపడలేదని అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, శాక్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రైతులు భిక్షగాళ్లుగా కనిపిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్, రాహుల్‌కు రైతుల గోసలు ఏం తెలుసని ప్రశ్నించారు. కొల్లాపూర్‌లో రైతులపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
దేశంలో, ప్రపంచంలో నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఎవరైనా జమచేశారని నిలదీశారు. కానీ, ఇప్పటివరకు 11 విడతల్లో రూ.72 వేల 815 కోట్లు జమచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దని వివరించారు. రైతుబీమా ద్వారా 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ.5,566 కోట్లు చెల్లించి ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చిందే కేసీఆర్ ప్రభుత్వమని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.29,144.61 కోట్ల రుణమాఫీ చేశామని, ఇలా దేశంలో ఏ ప్రభుత్వమైనా చేసిందా? అని మంత్రి నిరంజన్‌రెడ్డి నిలదీశారు. ఉమ్మడి పాలమూరు తలాపునే పారుతున్న కృష్ణానీటికి బీడుభూములకు రాకుండా ఎత్తగొడితే రైతుల పొలాల్లోకి ఎత్తిపోసిందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమనే విషయం రైతన్నలకు తెలుసని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ నియోజకవర్గానికి ఒక సభ పెట్టినా కాంగ్రెస్ అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. నిందలు, ఆరోపణలతో ప్రజల మెప్పును పొందలేరని ఆయన స్పష్టంచేశారు.
వ్యవసాయ కళాశాలలు 5
వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలు 4
ఉద్యాన కళాశాలలు 1
ఉద్యాన పాలిటెక్నిక్‌లు 1