హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పక్కరాష్ట్రం నుంచి వచ్చిన రోజువారీ కూలీ, జేసీబీ డ్రైవర్ సుభాన్‌ఖాన్ తొమ్మిది మందిని కాపాడి హీరో అయితే, ఒక్కరినీ కాపాడలేక ఖమ్మంలో ప్రభుత్వం, ముగ్గురు మంత్రులు జీరో అయ్యారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ‘క్యాబినెట్లో మిగిలిన ఆరు మంత్రి పదవులు భర్తీ చేసినప్పుడు సుభాన్ లాంటి దృఢమైన వ్యక్తిని మంత్రిగా పెట్టుకోండి.. ప్రజలకు ధైర్యాన్నిస్తారు’ అని చురకలంటించారు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, బాధిత రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నాలుగైదు హెలికాప్టర్లు వాడిన కాంగ్రెస్ పార్టీ, వరదలో కొట్టుకుపోతున్న ప్రజలను రక్షించేందుకు ఒక్క హెలికాప్టర్‌ను కూడా ఎందుకు సమకూర్చుకోలేకపోయిందని నిలదీశారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ నేత తుంగ బాలుతో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మొదటి రెండు రోజుల పాటు వరదలను ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, మూడో రోజు తీరిగ్గా సీఎం బయలుదేరినా, ప్రతిపక్ష నేతను విమర్శించేందుకే వెళ్లినట్టున్నదని ఎద్దేవాచేశారు.
వరద బాధితులకు సాయం గురించి అధికారులతో సమావేశం పెట్టి ప్రతిపక్షాన్ని నిందించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ కనిపించడం లేదనడం ఆశ్చర్యంగా ఉన్నదని, కేసీఆర్ అంటే వ్యక్తి కాదు.. వ్యవస్థ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రతి అభివృద్ధిలో, నీటిలో, పంటల్లో కేసీఆర్ ఉంటారని చెప్పారు. ఖమ్మంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ప్రజలకు సాయం చేయడంలో ముందున్నారని తెలిపారు. విపత్కర పరిస్థితులు, ప్రజలు అపత్కాలంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు మానవీయ కోణంలో పనిచేయాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వానికి ఆ కోణం లేదని మండిపడ్డారు.
వరద బాధితులు హాహాకారాలు చేస్తుంటే మంత్రులు, సీఎం తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇకడ సరిగా పని చేయకుండా ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నారని ఎద్దేవాచేశారు. హైదరాబాద్ నుంచి కదలకుండానే వరద ప్రాంతాలను పీఎం సందర్శించాలని సీఎం చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో రాష్ర్టానికి రాసిన లేఖలో ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.1,300 కోట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపిందని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను రాష్ట్రం పంపలేదని చెప్పిందని మండిపడ్డారు.
చేరికలకు ప్రత్యేకంగా రెవెన్యూ మంత్రిని పెట్టిన కాంగ్రెస్, ప్రతిపక్షాలను తిట్టేందుకూ ఓ మంత్రిని పెట్టుకోవాలని నిరంజన్‌రెడ్డి చురకలంటించారు. పరామర్శకు సీఎం.. జీపులో నిలబడి చేతులు ఊపుతూవెళ్తారా అని విమర్శించారు. పాలమూరు బిడ్డ సీఎం అయి 9 నెలలైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను చూడలేదని, నీటిపారుదలశాఖ మంత్రి కన్నెత్తి చూడలేదని మండిపడ్డారు. 40 రోజులు కష్టపడితే నాలుగు రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండేదని, అందులోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.