Niranjan Reddy | వనపర్తి : శాసనసభలో వనపర్తి జిల్లా సరళాసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించింది వనపర్తి రాజులు.. నిజాం రాజులు కాదు అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రో కూడా రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రికి తెలియక పోవడం విచారకరం అని పేర్కొన్నారు. శాసనసభ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేయడం కాంగ్రెస్ మంత్రులకు, పార్టీకి ఉన్న అవగాహనకు ఇది నిదర్శనమన్నారు.
దీనిని పూర్వం వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజులలో ఒకడైన రెండవ రామేశ్వరరావు కాలంలో సరళాదేవి పేరు మీదుగా ఒక చెరువులా నిర్మించారు. దీని నిర్మాణం కోసం రామేశ్వరరావు-II గారు ఇంజనీర్లను అమెరికాలోని కాలిఫోర్నియాకు పంపించి అధ్యయనం చేసిన తర్వాత శంకరమ్మపేటలో రూ. 35 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. సరళసాగర్ ప్రాజెక్ట్ను 1949 సెప్టెంబరు 15న ఆనాటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జనరల్ జయంతో నాథ్ చౌదరీ చేతుల మీదుగా ఊకచెట్టు వాగు మీద పునాదులు వేశారు. దీని సామర్థ్యం 0.42 టీఎంసీ ఈ ప్రాజెక్టు కింద 9 గ్రామాలకు సాగు నీరు అందుతుంది. దీనినే ఆధునీకరించి 1959 జూలై 26 వ తేదిన సరళా సాగర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. అప్పటి పిడబ్ల్యూడి శాఖా మంత్రి జె.వి. నర్సింగరావు ఈ ప్రాజెక్టును ప్రారంభించారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిజాం రాజులకు ఎలాంటి సంబంధం లేదు.. పూర్తిగా వనపర్తి రాజులు నిర్మించడం జరిగింది అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టు ఎవరు నిర్మించారో తెలియకుండా కాంగ్రెస్ మంత్రులు శాసనసభలో చెప్పడం విచారకరం. తెలంగాణ ప్రాజెక్టుల మీద వీరికి ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.