Niranjan Reddy | కాంగ్రెస్ గ్యారంటీల అమలు అర్రాజ్ పాటలా మారాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మాజీ కార్పోరేషన్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశంతో కలిసి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుతో పాటు ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో రేవంత్‌రెడ్డికే తెలియదన్నారు. వ్యవసాయం సాగనివ్వాలని ప్రభుత్వాన్ని కోరామని.. అదే సమయంలో హామీల అమలుకు సమయం తీసుకోమని చెప్పామన్నారు. రైతుబంధు ఆపేసి వ్యవసాయాన్ని ఆగం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు అధికారం లక్కీడ్రాలో లాటరీలాంటిదన్నారు.
రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను తిట్టేందుకు సీఎం కాలేదని.. ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యాచరణ ప్రకటించాలన్నారు. కొడంగల్ సభలో రేవంత్ భాష, వ్యవహార శైలి ముఖ్యమంత్రి హోదాకు తగినట్లుగా లేదన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎందుకో రేవంత్ తన తీరును సమీక్షించుకోవడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి తీరును తీవ్రంగా ఖండిసున్నామన్నారు. మంచి విషయాలు చర్చకు పెట్టి.. పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. పాలమూరు కష్టాలకు కేసీఆర్ కారణమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి కాంగ్రెస్ పుణ్యమేనన్నారు.
కరెంటు, నీళ్లు, రైతుబంధు, రైతుబీమా ఇచ్చి రైతులకు అండగా నిలిచింది కేసీఆరేనని గుర్తు చేశారు. రేవంత్ అధికారంలోకి రాగానే అన్నీ కట్క బంద్ చేసినట్లుగా ఆగిపోయాయన్నారు. కొడంగల్‌లో ఓడిపోయాక మల్కాజ్‌గిరిలో గెలిచి ఎంపీ అయ్యాక రేవంత్ ఎన్నిసార్లు తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌రెడ్డి పాత్ర గుండు సున్నా అని నిరంజన్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునేందుకు రేవంత్ కొడంగల్‌కు చేసిన పనులు మొత్తం పాలమూరుకు చేస్తున్నట్లుగా భ్రమలు కల్పిస్తున్నారన్నారు. కొడంగల్‌లో శంకుస్థాపన చేసిన కళాశాలలు అన్నింటికీ అనుమతులు తెచ్చింది కేసీఆరేనన్న నిరంజన్‌రెడ్డి.. ఇందులో రేవంత్ గొప్పదనమేముందని ప్రశ్నించారు.
174 టీఎంసీలు గ్రావిటీ ద్వారా పాలమూరుకు రావాల్సిన నీటిని పొగొట్టిన పాపం కాంగ్రెస్ పార్టీదేనన్నారు. దశాబ్దాల పాటు జూరాల, నెట్టెంపాడు, భీమా పథకాల నిర్మాణాలను కాంగ్రెస్ పార్టీ సాగదీసిందని ఆరోపించారు. 35 ఏండ్లు, 40ఏండ్ల పాటు పాలమూరు ప్రాజెక్టులను సాగదీసిన కాంగ్రెస్ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టారని మండిపడ్డారు. 3.94 లక్షల ఎకరాల కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం 3.9 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించారన్నారు. 17రిజర్వాయర్లను టెండర్లకు ముందే కాంగ్రెస్ ఎత్తివేసిందన్నారు. కల్వకుర్తి పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిలలో ఉన్న ఐదు పంపులు ఎన్నడూ నడవవన్నారు. ఐదు నడిస్తే టన్నెళ్లు, కాలువలు సరిపోవన్నారు. మూడు పంపుల సామర్థ్యం ఉన్న కాలువలు, టన్నెళ్లు నిర్మించి ఐదు పంపులు బిగించారన్నారు. సగం సగం పనులు చేసి కాంగ్రెస్ గాలికి వదిలేసిందన్నారు. 2014, 2019లో కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు అన్నీ నీట మునిగాయన్నారు. కాంగ్రెస్ మాదిరిగా మేము ఎన్నడూ రాజకీయం చేయలేదన్నారు. ఎలా చేస్తే బాగవుతాయని ఆలోచించి రైతులకు నీరందించామన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రైతుల పొలాలకు సాగునీరు అందించడం జరిగిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కేసుల మీద కేసులు వేసి వేధించారన్నారు. వాటన్నింటినీ తట్టుకుని నీళ్లిచ్చే దశకు తీసుకువచ్చామన్నారు. ఇప్పుడే మీరు అధికారంలోకి వచ్చారు వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లివ్వలేదని మాట్లాడడం అవివేకమన్నారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడని చవకబారు మాట్లాడడం భావ్యం కాదన్నారు. రేవంత్ కొడంగల్ ఎందుకు వెళ్లాడు? మల్కాజ్గిరి ఎందుకు వెళ్లాడు ? రాహుల్ వాయనాడ్, సోనియాగాంధీ రాజస్థాన్ ఎందుకు వెళ్లారు? అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కేంద్రమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అన్ని చోట్లా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై సేవలందించారన్నారు.
కేసీఆర్‌కి మించి పనులు చేసి రేవంత్ గొప్ప వ్యక్తి అనిపించుకుంటే మాకు ఎలాంటి అసూయ లేదన్నారు. మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు కూడా మీరిచ్చిన హామీలు అమలు చేయలేరన్నారు. ఒకటో గ్యారంటీ, రెండో గ్యారంటీ అంటూ హామీలను అర్రాజ్ పాటలా ప్రకటిస్తున్నారన్నారు. రైతుబంధు వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు ? ప్రశ్నించారు. ఎండిన పంటలు, సాగిన సాగు వెనక్కు వస్తాయా ? కాంగ్రెస్ నిర్వాకంతో యాసంగిలో పావు వంతు కూడా సాగు కాలేదన్నారు. గత ఏడాది, ఈ ఏడాది సాగు లెక్కలు అధికారికంగా ప్రకటించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. పాలమూరులో మొన్నటి వరకు 14 స్థానాల్లో.. రాష్ట్రంలో 88 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. భవిష్యత్‌లో ఘోర పరాభవానికి కాంగ్రెస్ ఇప్పటి నుండే సిద్ధం కావాలన్నారు.