Hyderabad | దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల వేల ఎకరాల్లో భూమి అందుబాటులో ఉన్నది.
సీఎం కేసీఆర్ దూరదృష్టి.. మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో తొమ్మిదేండ్లలోనే హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నది. భాగ్యనగర భూములకు అంతర్జాతీయ డిమాండ్ లభిస్తున్నది. అంతర్జాతీయస్థాయి రియల్, నిర్మాణ కంపెనీలు ఇదే మంచి తరుణంగా భావించి భూములను కొనుగోలు చేస్తుండగా..‘రియల్’ భవిష్యత్తుకు కలల సౌధంగా అవతరిస్తున్నది.
-గుండాల కృష్ణ, హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి
సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తొమ్మిదేండ్లుగా నమోదైన రికార్డులు కోకొల్లలు. ఎల్లలు లేకుండా విస్తరిస్తున్న అభివృద్ధితో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు బంగారు గనులను తలపిస్తున్నాయి. దేశంలోని ఏ మెట్రో నగరానికి కూడా లేనన్ని హంగులు, అనుకూలతలు ఈ నగర సొంతం కావడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. ప్రధానంగా దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే.. ప్రస్తుతం ఎకరాల విస్తీర్ణాల్లో భూమి అందుబాటులో ఉన్న నగరంగా హైదరాబాద్ ముందు వరుసలో ఉన్నది. ఈ నేపథ్యంలో దేశీయ రియల్, నిర్మాణ రంగంలో హైదరాబాద్ మార్కెట్ హాట్‌కేక్‌లా మారింది. సమీప భవిష్యత్తులోనే మహా నగర పరిధిలోని రియల్ మార్కెట్లోనూ చదరపు అడుగుల్లోనే భూ లావాదేవీలు జరగడం తప్ప ఎకరాల్లో దొరకడం కష్టమేనని రియల్ ఎస్టేట్ నిపుణులు రేపటి హైదరాబాద్ ముఖ చిత్రాన్ని విశ్లేషిస్తున్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయస్థాయి రియల్, నిర్మాణ కంపెనీలు ఇదే మంచి తరుణంగా భావించి ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నాయి.
ఇదే మంచి తరుణం
ఏ వ్యాపార సంస్థ అయినా ఒక్క రూపాయి వెచ్చిస్తుందంటే దానికి వంద రూపాయల ప్రతిఫలాన్ని ఆశిస్తుంది. ఇది వ్యాపార సూత్రం. మరి.. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల కోసం వేలం ప్రక్రియల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ స్థాయిలో పోటీ పడుతున్నాయంటే భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దేశంలో ఏ మెట్రో నగరాల్లోనూ ఇంత భారీస్థాయిలో భూముల లభ్యత అనేది లేదు. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ… ఏ నగరాన్ని తీసుకున్నా కంపెనీలకు చదరపు అడుగుల (స్కేర్ ఫీట్) రూపంలో మాత్రమే భూమి లభ్యత ఉన్నది.
కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం ఎకరాల్లో భూములు లభిస్తున్నాయి. దీనికితోడు హైదరాబాద్ చుట్టూ దాదాపు 50-60 కిలోమీటర్ల మేర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. దీంతో ఎల్లలు లేకుండా దూసుకుపోతున్న విస్తరణతో హైదరాబాద్‌లో భూములకు భలే డిమాండ్ వచ్చింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు భూమి కొనుగోలుకు పోటీపడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఇక్కడ భూముల లభ్యత అనేది కష్టసాధ్యంగా మారనున్నదని రియల్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు సుమారు 10 కిలోమీటర్ల చుట్టూ చదరపు అడుగుల రూపంలోనే భూముల బదలాయింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనతి కాలంలోనే ఈ పరిస్థితి దాదాపు 40-50 కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వివిధ రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు ఇదే మంచి తరుణంగా హెచ్ఎండీఏ వేలంలో పోటీపడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వేలం ప్రక్రియలే నిదర్శనం
ప్రైవేటు రంగంలో జరిగే భూ లావాదేవీలకు సంబంధించి కచ్చితమైన డిమాండ్ అంకెల్లో బయటికి రాదనేది బహిరంగ రహస్యం. కానీ గత కొంతకాలంగా హెచ్ఎండీఏ ఎకరాలు.. చదరపు గజాల్లోని భూములకు నిర్వహిస్తున్న వేలం ప్రక్రియల్లో హైదరాబాద్ చుట్టుపక్కల భూముల డిమాండ్ ఏస్థాయికి పెరిగిందనేందుకు అద్దంపడుతున్నది. ఆగస్టు నెలలో కేవలం వారం వ్యవధిలో హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలంలో రూ.7వేల కోట్లకు పైగా ఆదాయం రావడం రికార్డు. దేశ చరిత్రలోనే భూముల వేలం ద్వారా ఒకేరోజు ప్రభుత్వానికి రూ.3,600 కోట్లకు పైగా ఆదాయం రావడమనేది ఇదే తొలిసారి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దీంతో నగరంలో అంతర్జాతీయస్థాయి మౌలిక వసతుల కోసం ప్రభుత్వం వెచ్చించిన.. వెచ్చిస్తున్న ప్రతి పైసా ఖర్చు కాదు! వివిధ రంగాల అభ్యున్నతి కోసం వెచ్చించే పెట్టుబడి అనేది అక్షరాలా నిజమని మరోసారి రుజువైంది. కోకాపేటలో 43 ఎకరాలకు నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా ఎకరా ధర రూ.100 కోట్లతో 3.06 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఒక బిట్‌ను ప్రముఖ సంస్థ దక్కించుకోవడం రికార్డు. కనిష్ఠంగా ఎకరా రూ.67.25 కోట్లు పలకడమంటే భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మోకిల, షాబాద్‌లో చదరపు గజాల్లో నిర్వహించిన భూముల్లోనూ 300 గజాల విస్తీర్ణంలోని ప్లాట్లు నిర్దేశిత ధర కంటే ఏడెనిమిది రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయాయి. బుద్వేల్లోని 100.01 ఎకరాలకు నిర్వహించిన వేలంలోనూ గరిష్ఠంగా ఎకరాకు రూ.41.25 కోట్లు, కనిష్ఠ ధర ఎకరాకు రూ.33.25 కోట్లు పలికింది. ఇలా ఈ వేలంలో 100.01 ఎకరాలకు ఏకంగా రూ.3,625.73 కోట్లు ఒకేరోజు రావడం ఇప్పటివరకూ ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేదని రియల్ నిపుణులు వెల్లడించారు.
అటు విస్తరణ.. ఇటు వర్టికల్ డెవలప్మెంట్
వర్టికల్ డెవలప్మెంట్.. దేశంలోని ముంబై నగరంలో మాత్రమే ఇలాంటి అభివృద్ధి కనిపిస్తుంది. కారణం.. అక్కడి భౌగోళిక అననుకూలత. సముద్రం కారణంగా నగరం విస్తరించే అవకాశం లేదు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాలను తీసుకున్నా.. ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వర్టికల్ డెవలప్మెంట్ అనివార్యం అవుతున్నది కానీ, హైదరాబాద్ మహానగరంలో ఇతర నగరాలకు భిన్నంగా అభివృద్ధి జరుగుతుండటం విశేషం. ఒకవైపు పదుల కిలోమీటర్ల కొద్దీ విస్తరణ జరుగుతూనే.. మరోవైపు వర్టికల్ డెవలప్మెంట్ కూడా గణనీయంగా ఉన్నది. అందుకే అనతికాలంలోనే దేశంలోనే ముంబై తర్వాత ఎక్కువ ఆకాశహర్మ్యాలతోపాటు ఎత్తయిన భవనాలు ఉన్న నగరంగా హైదరాబాద్ ప్రసిద్ధికెక్కినట్టు ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది.
ముఖ్యంగా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెరుగుతున్నాయనేందుకు కూడా ఇదో నిదర్శనమని ఒక రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థ ఎండీ స్పష్టం చేశారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ తొమ్మిదేండ్లలో వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఈ సర్వేలో తెలిపారు. ఒక్కో భవనం 48 నుంచి 59 అంతస్థుల వరకు ఉన్నాయి. గత 3-4 ఏండ్లుగా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, పుప్పాలగూడతోపాటు కోకాపేటలో భారీ ఎత్తయిన భవనాలు నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎకరాల మేర భూమి లభ్యత అనేది చాలా ఖరీదుగా మారింది. కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలంలో ఎకరా రూ.100 కోట్లు ధర పలకడమే ఇందుకు ఉదాహరణ.
ఫ్రెండ్లీ గవర్నమెంట్‌కు ఫిదా
హైదరాబాద్ మహానగరంలో ప్రజలతోపాటు ప్రభుత్వం కూడా ఇతర ప్రాంతాలతో ఫ్రెండ్లీగా ఉండటమనేది మరో ప్రత్యేకత. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు అన్నిరకాలుగా సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దేశంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులను ఇస్తున్నది. ఒకవైపు పుష్కలమైన ల్యాండ్ బ్యాంక్.. మరోవైపు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండటంతో పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. తద్వారా రియల్ రంగానికి విపరీతమైన జోష్ వచ్చింది. దీనికితోడు కంపెనీల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ పుష్కలంగా ఉన్నందున నివాసాలపరంగానూ రియల్ రంగంలో లావాదేవీలు భారీ ఎత్తున పెరుగుతున్నాయి.
విశ్వనగర దిక్సూచి
దేశంలోని మరే ఇతర మెట్రో నగరాలకు లేనివిధంగా హైదరాబాద్ మహా నగరానికి కేవలం భౌగోళికంగానే కాదు… వాతావరణ, భాషాపరమైన అనుకూలతలు కూడా ఉండటం విశేషం. ఒకవిధంగా ప్రపంచంలోనే ఇలాంటి నగరాలు అరుదుగా ఉంటాయని అంతర్జాతీయస్థాయి కంపెనీలే గుర్తించాయి. అందుకే తమ కంపెనీలకు చెందిన అత్యంత కీలకమైన సమాచారం ఉండే సర్వర్లతో కూడిన డాటా సెంటర్లను హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు చేస్తున్నాయి. ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడ డాటా సెంటర్లను ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనం. మరోవైపు ఇతర నగరాల్లో భాష, సంస్కృతిపరంగా ఇతర ప్రాంతాల వారు మనుగడ సాధించడం కష్టంగా ఉంటుంది. కానీ హైదరాబాద్ నగరంలో ఇతర ఏ ప్రాంతాలవారికీ కించిత్తు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన ఇతర ప్రాంతాల వారే చెప్తున్న సత్యం. ఇక్కడ ఏ ఒక్కరికైనా రెండు భాషలు తెలిసి ఉంటాయి. దీంతో ఇతర ప్రాంతాల వారు సులువుగా ఇక్కడ జీవనాన్ని సాగించేందుకు వీలుంటుంది. ఈ కారణంగానే ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వాళ్లు కూడా భారీ ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో భూములకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.
‘రియల్’ సర్వేల్లో మార్మోగుతున్న హైదరాబాద్
దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో నిర్వహించే రియల్ సర్వేల్లో గత ఆరేడేండ్లుగా హైదరాబాద్ పేరు మార్మోగుతున్నది. అటు రియల్ పెట్టుబడులతోపాటు ఆఫీస్ స్పేస్‌లోనూ మహానగరం ఇతర మెట్రోలను దాటి దూసుకుపోతున్నది. హైదరాబాద్ 2.0 పేరుతో వెల్లడించిన నివేదికలో 2016 నుంచి 2022 వరకు ఐటీ, ఐటీఈఎస్తో పాటు ఫార్మా, బయోటెక్నాలజీ, లాజిస్టిక్… ఇలా వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన విధానంపై రూపొందించిన నివేదికలో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆల్ టైం హైగా రికార్డు నమోదైంది. సుమారు 11.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ వినియోగంలోకి రావడం విశేషం. అలాగే, జేఎల్ఎల్ నివేదిక ప్రకారం.. 2021లో దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని రియల్ రంగంలో విదేశీ సంస్థాగత పెట్టుబడుల్లో హైదరాబాద్ టాప్‌గా నిలిచింది. విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్లు, ప్రైవేటు ఈక్విటీ ప్లేయర్స్, రియల్ ఎస్టేట్ ఫండ్-కమ్-డెవలపర్స్, విదేశీ నిధులతో కూడిన ఎన్బీఎఫ్సీలు, సావరిన్ వెల్త్ ఫండ్లు, ఆర్ఈఐటీల వంటివి సంస్థాగత పెట్టుబడుల్లో ఉంటాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఈ పెట్టుబడుల విలువ ఏకంగా 687 మిలియన్ డాలర్లకు చేరుకొన్నది. ముంబైలో 683 మిలియన్ డాలర్లు, ఢిల్లీ (548), బెంగళూరు (379), కోల్‌కతా (105), చెన్నై (105), పుణె (77)గానే ఉంది. ఇలా ప్రతి ఏటా వస్తున్న సర్వేల్లో హైదరాబాద్ టాప్‌గా నిలువడం విశేషం.
హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు